కత్రినా ఇన్.. సచిన్ ఔట్...

 

కత్రినా ఎంటరయ్యేసరికి సచిన్ టెండూల్కర్ని అక్కణ్ణించి పంపించేశారు? కారణం వీరిద్దరి మధ్య ఏవైనా గొడవలున్నాయా? సచిన్‌ని పంపేయమని కత్రినా చెప్పిందా? అయినా ఆమె చెప్పినంత మాత్రాన సచిన్ని అక్కణ్ణించి పంపేస్తారా... ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి కదూ? అవును నిజంగానే అక్కడకి కత్రినా కైఫ్ రాగానే సచిన్‌ని బయటకి పంపేశారు. అది ఎక్కడో కాదు.. ప్రముఖుల మైనపు బొమ్మలను ప్రతిష్టించే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో. ఈ మ్యూజియంలో భారతీయ అందాలరాశి కత్రినా కైఫ్ నిలువెత్తు మైనపు బొమ్మను వుంచారు. ఈ బొమ్మను చూడడానికి శుక్రవారం నాడు కత్రినా కైఫ్ వచ్చింది. తన ప్రతిరూపం ముందు పోజులు ఇచ్చింది. ఎవరు ఒరిజినలో, ఎవరు మైనపు బొమ్మో అర్థంకాని విధంగా అక్కడి సిట్యుయేషన్ మారింది. ఇదిలా వుంటే, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వున్న సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మని అక్కడి నుంచి తరలించారు. టెండూల్కర్ బొమ్మ ఏమైందని మ్యూజియం నిర్వాహకులను అడిగితే సచిన్ మైనపు బొమ్మని మ్యూజియంలోంచి తీసేశామని, దాన్ని బ్యాంకాక్‌కి పంపామని చల్లగా చెప్పారు. అది విన్నవారు షాక్ అయ్యారు. మ్యూజియం నిర్వాహకులు వివరణ ఇస్తూ, తమ మ్యూజియంలో ఉన్న బొమ్మలను ఇలా అనేక ప్రదేశాలకు మార్చడం మామూలేనని చెప్పారు. పైగా సచిన్ టెండూల్కర్‌ బొమ్మ ఐసీసీ టీ 20 టోర్నమెంట్‌లో ధరించినట్టుగా బ్లూ జెర్సీ ధరించి వుండేది. అయితే సచిన్ ఆ టోర్నీలో పాల్గొనలేదన్న విషయాన్ని మిడ్ డే పత్రిక మ్యూజియం నిర్వాహకుల దృష్టికి తెచ్చింది. దాంతో సచిన్ జెర్సీని మార్చాలని మ్యూజియం నిర్వాహకులు భావించారు. ఈలోపు ఆ బొమ్మని బ్యాంకాక్‌కి పంపారు. సరే.. ఏది ఏమైనప్పటికీ మేడమ్ టుస్సాడ్ లండన్ మ్యూజియంలోకి కత్రినా కైఫ్ ఇన్... సిడ్నీ మ్యూజియంలోంచి సచిన్ టెండూల్కర్ ఔట్.