సబ్బం హరిది రాజకీయ ఆత్మహత్యా?

 

జైసపా అభ్యర్ధిగా వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ దిగిన సబ్బం హరి, ఎన్నికలకు కొన్ని గంటల ముందు పోటీ నుండి విరమించుకొని, పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీ, తెదేపాలకు మద్దతు తెలపడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని వైకాపా నేత వాసిరెడ్డి పద్మావతి వ్యాఖ్యానించారు. కానీ సబ్బంహరి బీజేపీ తరపున వైజాగ్ నుండి పోటీ చేస్తున్న ఆ పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబుకు తోడ్పడటం ద్వారా చాలా తెలివిగా వ్యవహరించి, విజయావకాశాలున్న ఆ పార్టీలో కర్చీఫ్ వేసినట్లే భావించవచ్చును.

 

సబ్బంహరి వంటి అపార రాజకీయ అనుభవజ్ఞ్డుడు ఒట్టి పుణ్యాన్న పోటీ నుండి విరమించుకొని తన ప్రత్యర్ధులకు మద్దతు పలికారంటే అంతకంటే అవివేకం ఉండబోదు. ఆయన వెనక్కి తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి.

1. జైసపా అభ్యర్ధిగా నిలబడిన తాను ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని ఆయన గ్రహించారు. ఎలాగు ఓడిపోతామని తెలిసినపుడు, ఇంకా పోటీలో కొనసాగే బదులు బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా (త్యాగం) పోటీ నుండి విరమించుకొన్నట్లయితే, మున్ముందు బీజేపీలో చేరి ఏదయినా పదవో, అధికారమో స్వీకరించవచ్చును. ఆ పార్టీలో కాకపోతే తెదేపాలోనయినా చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. లేదా ఆ రెండు పార్టీలతో సత్సంబందాలు ఏర్పరుచుకోవచ్చును.

 

2. బీజేపీ అభ్యర్ధికి మద్దతు తెలపడం ద్వారా తనను ఘోరంగా అవమానించిన వైకాపా అభ్యర్ధి విజయమ్మ విజయావకాశాలను దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకోవచ్చును. మరి ఆయన నిర్ణయం తప్పో ఒప్పో వైకాపా నేతలే చెప్పాలి.