సబ్బం హరి నిష్క్రమణతో మారనున్న బలాబలాలు

 

జై సమైక్యాంధ్ర పార్టీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న సబ్బం హరి, ఎన్నికలకి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నఈ తరుణంలో పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా ఎన్నికలబరి నుండి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఆయన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వైజాగ్ నగరానికి మేయర్ గా కూడా పనిచేసారు. కానీ కొన్ని కారణాల వలన ఆరేళ్ళపాటు పార్టీ నుండి బహిష్కరింపబడ్డారు. సాధారణంగా అంతకాలం పార్టీకి దూరమయిన వారు మళ్ళీ పార్టీలోకి వచ్చే ఆలోచన చేయరు. వచ్చినా వారికి ఎటువంటి ప్రాధాన్యము ఉండదు. కానీ, సబ్బం హరి మాత్రం గత ఎన్నికలలో అనకాపల్లి యంపీ టికెట్ సాధించుకోవడమే కాకుండా అక్కడి నుండి గెలిచి మళ్ళీ తన రాజకీయ జీవితాన్ని గాడిన పెట్టుకోగలిగారు. జగన్ పార్టీ పెట్టిననాటి నుండి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికలలో తాను వైకాపా టికెట్ పైనే పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ లో ఉండగానే ప్రకటించారు.

 

జగన్ జైలు నుండి విడుదల అయిన తరువాత , ఇక వైకాపా తీర్ధం పుచ్చుకొని పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్దమయిన తరువాత తనింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సంగతి మరిచిపోయి, తను అప్పుడే వైకాపాసభ్యుడు అయిపోయినట్లు భావిస్తూ ‘మా పార్టీ (వైకాపా) ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీయే కూటమికే మద్దతు ఇస్తుంది” అని ఆయన ప్రకటించేశారు.

 

ఆ సమయంలో, “జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో ఆవిధంగా రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నందునే బెయిలు మీద బయటకు రాగలిగారని” తెదేపా నేతలు చేస్తున్న తీవ్ర విమర్శలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ యంపీగా ఉన్న సబ్బం హరి ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ప్రకటన చేయడంతో తీవ్ర ఆగ్రహం చెందిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీలో ప్రవేశించక మునుపే ఆయన మొహం మీదనే తలుపులు మూసి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసారు.

 

అ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని వైజాగ్ నుండి విజయమ్మపై పోటీకి దిగిన సబ్బం హరి, ఇప్పుడు తాను గెలిచే అవకాశాలు కనిపించకపోవడంతో, బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా పోటీ నుండి విరమించుకొన్నారు. స్థానికుడయిన సబ్బం హరికి వైజాగ్ లో మంచి బలం, పలుకుబడి, అన్ని పార్టీల నేతలతో, కార్యకర్తలతో సత్సంబందాలు కూడా ఉన్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీ, తెదేపా అభ్యర్ధులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి, తన అభిమానులను కూడా వారికే ఓటు వేయమని అభ్యర్ధిస్తున్నారు. తత్ఫలితంగా విజయమ్మ విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ ప్రభావం అసెంబ్లీ అభ్యర్దులపైనా పడవచ్చును. ఏమయినప్పటికీ ఇది కిరణ్, జగన్ రెడ్డిలు ఇద్దరికీ ఇబ్బందికరమేనని చెప్పవచ్చును.