సబ్బం హరి పోటీ ఎవరితో?

Publish Date:Apr 24, 2014

 

అనకాపల్లి సిట్టింగ్ యంపీ సబ్బం హరి, కొన్ని నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే వైకాపా తరపున పనిచేసారు. జగన్ జైలు నుండి విడుదల కాగానే కాంగ్రెస్ ను వీడి వైకాపాలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నారు. అయితే ఆయన వైకాపాలో చేరక మునుపే అత్యుత్సాహానికి పోయి “ఎన్నికల తరువాత తమ పార్టీ (వైకాపా) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని” నోరుజారడంతో, ఆయనకి వైకాపా తలుపులు మూసుకుపోయాయి.

 

ఆ తరువాత నుండి మళ్ళీ ఆయన నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తూ, అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమంతో మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డికి క్రమంగా దగ్గరయ్యారు. ఆనక కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో, కాంగ్రెస్ నుండి వేరుపడి కొత్త పార్టీ పెట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన కూడా సమైక్యమయిపోయారు. ఈసారి జైసాపా పార్టీ టికెట్ మీద వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

 

ఆయన వైజాగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం తను పార్టీలో చేరక ముందే తన మొహం మీద తలుపులేసి అవమానించిన వైకాపాపై ప్రతీకారం తీర్చుకోవడానికే! ఈసారి ఎన్నికలలో తాను గెలవకపోయినా పరువాలేదు కానీ విజయమ్మ గెలవకుండా అడ్డుపడగలిగితే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిని ఓడించిన ఘనత దక్కుతుంది. అంతే గాక తమ పార్టీ గౌరవాధ్యక్షురాలినే గెలిపించుకోలేకపోయినందుకు వైకాపాకు తీరని అవమానమే. ఆవిధంగా వైకాపా ప్రతీకారం తీర్చుకోన్నట్లవుతుందని సబ్బం హరి ఆలోచన.

 

సబ్బం హరి అందుకు సమర్దుడేనని చెప్పవచ్చును. బీజేపీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కంబంపాటి హరిబాబు పేరు వైజాగ్ ప్రజలు విని ఉండకపోవచ్చునేమో కానీ వైజాగ్ కి మాజీ మేయర్ గా విశేష సేవలందించిన సబ్బం హరి గురించి తెలియని వారుండరు. స్థానికుడయిన ఆయనకు అనేకమంది అనుచరులున్నారు, అన్ని పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఆయన ఈ ఎన్నికలలో తాను గెలిచినా గెలవకున్నా విజయమ్మ విజయావకాశాలకు గండి కొట్టగల సమర్ధుడు.

 

ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్ధులలో ఎవరో ఒకరికి లోపాయికారిగా సహకరించి నట్లయితే విజయమ్మ విజయం అనుమానమే అవుతుంది. ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన భావించినట్లయితే ఆ పార్టీ అభ్యర్ధికి సహకరించవచ్చును. తద్వారా ఎన్నికల తరువాత ఆయన బీజేపీలోకి మారిపోయి, చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఏ రాజ్యసభ సీటులోనో ఒద్దికగా సర్దుకు పోవచ్చును. అందువల్ల ఒకవేళ విజయమ్మ ఓడిపోయినట్లయితే ఆమె ఓటమికి సబ్బం హరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని ఆయనతో రాజీపడినట్లయితే, ఆయన విజయమ్మకే సహకరించినా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News