పాపం సబ్బం...

 

వైజాగ్ మాజీ మేయర్ సబ్బం హరి కాంగ్రెస్ యంపీగా కొనసాగుతున్నపటికీ ఇంతకాలంగా వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే అనేకమంది కాంగ్రెస్ నేతలు వైకాపాలో జేరినప్పటికీ, ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని చెపుతూ ఇంత కాలంగా తన రెండు పడవల ప్రయాణం సాఫీగా లాగించేస్తున్నారు. కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదలయ్యి బయటకి వచ్చేసారు గనుక ఇక నేడో రేపో వైకాపాలో జేరవచ్చునని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన మళ్ళీ తన పాత పాటే పాడుతూ త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని తాజాగా మరోమారు ప్రకటించారు.

 

అయితే, ఈ లోగా అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీగానే కొనసాగుతున్నననే సంగతి మరిచిపోయి, తమ పార్టీ (వైకాపా) 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి మాత్రమే మద్దతు ఇస్తుందని ప్రకటించేశారు.

 

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవడం వలనే జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా ఆరోపణలు చేస్తున్నఈ తరుణంలో సబ్బం హరి, ఇంకా వైకాపాలో చేరక ముందే వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ప్రకటించడంతో వైకాపా కంగు తింది. గతంలో విజయమ్మ, భారతి, షర్మిల ముగ్గురూ కూడా 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అదే మాట సబ్బంహరి సమయం కాని సమయంలో ప్రకటించడంతో తెదేపా చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయన ఋజువు చేసినట్లయింది. పైగా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండటంతో అ రెండు పార్టీల మధ్య గట్టి బంధమే ఉన్నట్లు దృవీకరించినట్లయింది.

 

ఈ ప్రకటన చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని సబ్బం హరి ప్రకటించడం వైకాపాకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అందుకే ఆ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సబ్బం హరి ఒక సీనియర్ రాజకీయనేత అని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాల గౌరవం ఉండేది. కానీ మొన్నఆయన మాట్లాడిన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధ పడ్డారు. సబ్బం హరి మాటలతో కానీ, ఆయనతో గానీ మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. ఆయన మా పార్టీ సభ్యుడు కూడా కాదు. ఒకవేళ ఆయన వచ్చి పార్టీలో చేరుతామన్నా మేము చేర్చుకోదలచుకోలేదు,” అని తెలిపారు.

 

ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, జగన్ కి జై కొడుతూ, తన పార్టీ అధిష్టానాన్ని విమర్శించిన పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతనిని పట్టించుకొనేవారు లేరు. పాపం అత్యుత్సాహానికి పోయి నోరు జారినందుకు ఇప్పుడు వైకాపా తలుపులు మూసుకు పోయాయి. రెంటికీ చెడిన రేవడి అంటే ఇదేనేమో. సబ్బం సంగతి ఎలా ఉన్నపటికీ, కుమ్మక్కు ఆరోపణలను ఎదుర్కోలేక అవస్థలు పడుతున్న వైకాపాకి సబ్బం హరి, పార్టీలో చేరకపోయినా పార్టీ పరువు మాత్రం తీసిపోయాడు.