వ్యర్ధ వాదనలతో కాలక్షేపం చేస్తున్నఅధికార, ప్రతిపక్ష పార్టీలు

 

కొద్ది రోజుల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక మాజీ కేంద్ర మంత్రి, మాజీ హోం మంత్రితో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలను, పోలీసులను మావోయిష్టులు అతి కిరాతకంగా హతమార్చినపుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రమయిన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటూ అసలు విషయాన్ని పక్క ద్రోవ పట్టించారు. తత్ఫలితంగా మావోయిష్టులు మళ్ళీ మరో మారు చెలరేగిపోయి, ఈసారి జిల్లా యస్.పీ. మరియు కొందరు పోలీసులను పొట్టన పెట్టుకొన్నారు.

 

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బోధ గయ ప్రేలుళ్ళలో బీజేపీ హస్తం ఉందేమో? అంటూ నిరాధారమయిన ఆరోపణలు చేసిన మరునాడే ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు అది తమ పనేనని ప్రకటించుకోవడమే కాకుండా, త్వరలో ముంబైలో ప్రేలుళ్ళు జరుపబోతున్నామని ప్రకటించి ప్రభుత్వానికి పెనుసవాలు విసిరారు.

 

ఉగ్రవాదులు, మావోయిష్టుల నుండి దేశాన్ని రక్షించడంలోను, బాంబు దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నపటికీ తన తప్పులను కప్పి పుచ్చుకోనేందుకు ఉన్నతమయిన స్థానాలలో ఉన్న దిగ్విజయ్ సింగ్ వంటి రాజకీయనేతలు, దేశరక్షణకు సంబందించిన వ్యవహారాలపై కూడా రాజకీయాలు చేయడం చాల శోచనీయం.

 

అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం సహజమే. అయితే, అధికారంలో ఉన్నవారు కూడా ఇటువంటి తీవ్రమయిన అంశాలపై రాజకీయం చేయడం, ప్రతిపక్షాలతో వాగ్వాదాలు చేస్తూ కాలక్షేపం చేయడం చాలా అవివేకం. ప్రతిపక్షాలు తమ వైఫల్యాలను ఎత్తిచూపినప్పుడు వాటిని హుందాగా స్వీకరించి వాటిని సవరించుకొంటే పొరపాట్లు పునరావృతం కావు. కానీ, ప్రతిపక్షాల విమర్శలను సమర్ధంగా ఎదుర్కోనకపోతే, తమ ఒప్పుకొన్నట్లేననే ఒక దురభిప్రాయం మన నేతలలో దృడంగా పాతుకుపోవడం వలన, విమర్శలకు దీటుగా జవాబీయకపోతే ప్రతిపక్షాలు రాజకీయంగా తమపై పైచేయి సాధిస్తాయనే దురాలోచన వలన, అధికార పార్టీకి చెందిన నేతలు ముందు వెనుక చూడకుండా ఈవిధంగా ప్రత్యారోపణలు చేయడం రివాజుగా మారిపోయింది.

 

ప్రతిపక్షాల సూచనలు సలహాలు లెక్కలోకి తీసుకోవడం వలన తాము రాజకీయంగా నష్టబోతామనే భయమే దీనికి కారణం. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఇటువంటి విషయాలలో ప్రభుత్వానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఈయడం తమ బాధ్యత కాదనే అపోహ కలిగి ఉండటం, ఆవిధంగా చేస్తే తాము ఎన్నటికీ ప్రతిపక్ష బెంచీలకే పరిమితమయిపోతామనే దురాభిప్రాయం ఏర్పరుచుకొన్నందున అవి కూడా చాలా బాధ్యతా రాహిత్యంగానే ప్రవర్తిస్తున్నాయి.

 

అధికార, ప్రతిపక్ష నేతలు చేస్తున్నఇటువంటి వ్యర్ధ వాదనలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పనికి వస్తాయి తప్ప, మావోయిస్టుల నుండి, ఉగ్రవాదుల దాడుల నుండి అవి ప్రజలను రక్షించలేవు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలను నిందిస్తు కాలక్షేపం చేసే బదులు రేపు ముంబైలో బాంబులు ప్రేలుస్తామని ముందే హెచ్చరిస్తున్న ఉగ్రవాదుల దాడిని నివారించడానికి ఏమయినా చర్యలు చేపడితే అమాయకులయిన ప్రజల ప్రాణాలు కాపాడినవారవుతారు.