బాదుడే బాదుడు!


 

ఈ వేసవిలో ఎంతమందికి వడదెబ్బ తగిలిందో కానీ... వేసవి ముగిసిన తరువాత ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలతో దిమ్మ తిరిగిపోతోంది. బంగారు తెలంగాణలో ఈ బాదుడు పర్వమేమిటా అంటూ మనసు చిన్నబోతోంది. మొన్నటికి మొన్న ‘ఆర్టీసీ లాభాల బాటను పట్టకపోతే మూసేస్తాం’ అంటూ ముఖ్యమంత్రి చేసిన బెదిరింపు వల్లనో ఏమో... ఆర్టీసీ ఛార్జీలను పెంచిపారేశారు. ఈ విధానం కనుక అమలులోకి వస్తే సిటీ బస్సులలో ప్రయాణించేవారు సైతం ఓ పది శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బతుకు తెరువు కొంత బస్టాండులోనే వదిలిపోనుంది.

 

ఇక విద్యుత్తుశాఖ కూడా, బిల్లు చూడగానే షాక్‌ కొట్టే ఓ కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. వంద యూనిట్ల దాటిన వారి జేబులు చిల్లులు పడిపోవాల్సిందే. ఇక మీదట ఎండాకాలంలో ఏసీనో, చలికాలంలో గీజరో వేసుకుని సుఖపడదామనుకుంటే లాభం లేదు. పొరపాటున రెండు వందల యూనిట్లకి మించి ఓ పది యూనిట్లు దాటినా దాదాపు 200 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొన్నటివరకూ ఉన్న శ్లాబుల విధానాన్ని కూడా ఎడాపెడా మార్చేయనుంది విద్యుత్‌ శాఖ.

 

అటు రోడ్డు మీదకి వెళ్తే ఆర్టీసీ, ఇటు ఇంటిపట్టున ఉంటే విద్యుత్‌ శాఖ... మధ్యతరగతి నడ్డివిరిచేందుకు సిద్ధపడిపోయాయి. దీని గురించి జనం ఏమనుకుంటున్నారన్నది ఎలాగూ ఎవరికీ పట్టదు. జనం తరఫున పోరాడాల్సిన ప్రతిపక్షాల జాడేమో కనిపించడం లేదు. కాబట్టి కొంచెం అటూఇటూగా ఈ వడ్డనకి సిద్ధపడక తప్పదు. ఏమొచ్చినా మధ్యతరగతి ప్రజలకే కదా అని తిట్టుకోకా తప్పదు. కానీ, అసలు చార్జీలు పెంచాల్సిన అగత్యం ఏమొచ్చిందన్నదే ప్రతి పౌరుడిలో మెదులుతున్న ప్రశ్న! ప్రతిసారీ నష్టాల గురించీ, వాటిని పూడ్చుకునేందుకు చార్జీలు పెంచాల్సిన అవసరం గురించి చెప్పుకు వచ్చే ప్రభుత్వ శాఖలు... ఆ నష్టాలను నివారించే ఇతర చర్యల వైపు ఎందుకు దృష్టి సారించవు! అన్నదే సందేహం.

 

ఆర్టీసీ ప్రత్యామ్నాయ వనరుల మీద ఎంతవరకు దృష్టి పెట్టింది? పరిస్థితులకు, అవసరాలకి అనుగుణంగా బస్సులను నడపడంలో ఎంతవరకూ సమర్థవంతంగా పనిచేస్తోంది?... లాంటి సవాలక్ష ప్రశ్నలు సామాన్యుడిలో సైతం ఉదయించక మానవు. మరోవైపు ప్రత్యామ్నాయ విద్యుత్తుని ప్రోత్సహించడంలో విద్యుత్‌ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సౌర విద్యుత్ సొగసులు, ఎల్ఈడీ కాంతుల ధగధగలు లాంటి శీర్షికలు పేపర్లలో కనిపిస్తున్నాయే కానీ మన జీవితాలకు దూరంగానే ఉన్నాయి. సముద్రమట్టానికి పై ఎత్తున ఉండే హైదరాబాద్ వంటి ప్రాంతాలు పవన విద్యుత్తుకు అనుకూలం అని తెలిసినా, ఆ దిశగా తడబడే అడుగులు కూడా పడటం లేదు.

 

ప్రభుత్వ సంస్థలు ప్రత్యామ్నాయ వనరుల మీద దృష్టి పెట్టడం లేదు సరే! కనీసం నాణ్యమైన సేవలనన్నా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. వచ్చేపోయే విద్యుత్తుతో హైదరాబాదు శివారు ప్రాంతాలే అంధకారంలో ఉంటున్నాయి. వస్తుందో రాదో తెలియని బస్సు కోసం నగరం నడిబొడ్డున జనం ఎదురుచూపులతో కనిపిస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్యం, రవాణా రంగాలలో ప్రభుత్వ సేవల కంటే ప్రైవేటు సేవల పట్లే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడ విద్యుత్‌ రంగం పట్ల కూడా మనసు విరిగిపోతే... అది ప్రజాస్వామ్యానికే ఒక మచ్చగా మిగిలిపోతుంది.

 

రవాణా, విద్యుత్‌ చార్జీలను పెంచుతూ ప్రకటనలను వెలువడినప్పటికీ.... ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దమనసు చేసుకుని వాటిని ఉపసంహరించేందుకు తగిన ఆదేశాలను జారీ చేయవచ్చు. వినియోగదారుల మీద భారం మోపకుండానే లాభాలబాటని పట్టమంటూ సదరు శాఖలకు సూచించవచ్చు. సంబంధిత శాఖలు లాభాల బాట పట్టేవరకూ అయ్యే ఖర్చుని భరించడం ప్రభుత్వానికి అంత భారం కాబోదు. సంక్షేమం కోసం కోటానుకోట్లను ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి రవాణా, విద్యుత్‌ వంటి సేవలు కూడా సంక్షేమమే అని తెలియకుండా పోదు! ఒకవేళ అలా తెలియకుండా పోతే ఇక చేసేదేమీ లేదు....