Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విశాఖ ఎయిర్ పోర్టులో నాడు-నేడు.. తమిళనాడు తరహాలో ప్రతీకార రాజకీయం...
posted on: Feb 28, 2020 9:20AM
.jpg)
అప్పుడు జగన్... ఇప్పుడు చంద్రబాబు... ప్లేస్ ఒకటే... లీడర్స్ డిఫరెంట్.... అప్పుడూ ఇప్పుడూ, విశాఖ విమానాశ్రయమే యుద్ధక్షేత్రమైంది... నాడు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేయడానికి వెళ్లిన జగన్‌ను చంద్రబాబు దిగ్బంధనం చేస్తే, ఇప్పుడు అదే ప్లేస్ లో చంద్రబాబును జగన్ ఉక్కిరిబిక్కిరి చేశారు. మొత్తానికి, ఊహించినట్టుగానే టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబు విశాఖ పర్యటన యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే, భారీ సంఖ్యలో చేరిన జనం చంద్రబాబును అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
2017, జనవరి 26, ప్రత్యేక హోదా కోసం విశాఖలో నిరసన చేయడానికి నాటి ప్రతిపక్ష నేత జగన్, ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి పర్మిషన్ లేదని, ముందుకు కదలనివ్వలేదు. దాంతో ఎయిర్‌పోర్టు రన్‌వే పరిసరాల్లోనే దీక్షకు కూర్చున్నారు జగన్. రాష్ట్రానికి హోదా కోసం పోరాడుతుంటే, చంద్రబాబు ప్రభుత్వమే స్వయంగా అడ్డుకుందన్న అంశాన్ని, ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎంతోకొంత సానుభూతి పొందడంలో సఫలమయ్యామన్నది వైసీపీ భావన. ఇప్పుడు చంద్రబాబు పర్యటన కూడా, ఆనాటి జగన్ పర్యటనను తలపించింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే, రెండు ఘటనల్లోనూ చాలా తేడా ఉందంటున్నారు. నాడు హోదా కోసం అరెస్టయి, జగన్ సింపతీ పొందారని, కానీ చంద్రబాబు విశాఖను రాజధానిగా వ్యతిరేకించి, అదే వైజాగ్ లో అడుగుపెట్టారని, దాంతో సహజంగానే విశాఖలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు.
టీడీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబును అడ్డుకున్నవారిలో వైసీపీ కార్యకర్తలుండొచ్చు, కానీ క్యాపిటల్‌గా సాగర నగరాన్ని వ్యతిరేకించి, అదే సిటీలో అడుగుపెట్టడం బాబుకు ఇబ్బంది అవుతుందని ముందు నుంచీ ఊహించిందే. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలే, విశాఖ రాజధానిగా వ్యతిరేకించలేక సతమతమయ్యారు. వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం క్యాపిటల్ ప్రతిపాదనను సమర్థించారు. అలా సమర్థించలేకపోతే, స్థానిక టీడీపీ నేతల ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబుకు సహజంగానే వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే, మూడు రాజధానుల ప్రతిపాదనలతో, మూడు ప్రాంతాలూ, మూడు రకాలుగా స్పందిస్తున్నాయి. గుంటూరు, కృష్ణాలో చంద్రబాబుకు సింపతీ రావొచ్చేమో కానీ, ఉత్తరాంధ‌్ర, రాయలసీమల్లో మాత్రం, బాబు ఆశించిన సానుభూతి మాత్రం లభించదంటున్నారు.
సింపతీ విషయాలు పక్కనపెడితే, అధికార, విపక్షాలు మాత్రం రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, విశాఖలో చంద్రబాబు దిగ్భంధనాన్ని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. విశాఖను రాజధానిగా వ్యతిరేకించినందుకు, విశాఖ ప్రజలు చంద్రబాబును తిప్పి పంపారని, ప్రజాగ్రహంతో బాబు వెనుతిరగాల్సి వచ్చిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, తనను అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యానికే మచ్చగా అభివర్ణిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకున్నే అడ్డుకుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైజాగ్‌లో తనను అడ్డుకోవడాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ ఘటనను ప్రయోగించాలనుకుంటున్నారు. ఓటమితో తీవ్ర నిరాశలో వున్న తెలుగు తమ్ముళ్లలో హుషారు నింపాలనుకుంటున్నారు. ఇలా చంద్రబాబును ప్రజలను తిప్పికొట్టారని వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, సానుభూతిగా మలచుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారు. మరి నాడు వైసీపీ సానుభూతి పొందితే, నేడు చంద్రబాబుకూ అదే సానుభూతి లభిస్తుందా? లేదా? అనేది స్థానిక ఎన్నికల్లో తేలుతుంది.






