వనమాను అరెస్ట్ చేయని పోలీసులు.. సీఎం సపోర్ట్ వల్లేనా? 

posted on: Jan 6, 2022 1:35PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో నిందితుడిగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు ఇంకా అరెస్ట్ కాలేదు. పక్కాగా ఆధారాలు కనిపిస్తున్నా ఎమ్మెల్యే కొడుకును పోలీసులు పట్టుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబం చనిపోవడానికి కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేయాలంటూ ఉద్యమాలు ఊపందుకున్నాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వనమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 

పాల్వంచ లోని వనమా రాఘువ ఇంటి ముందు ధర్నాకు దిగారు  బిజేపి జిల్లా అధ్యక్షుడు. వనమా రాఘువను అరెస్ట్ చేయాలని, సిఎం కేసిఆర్ స్పందించి  ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ని టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వనమా వెంకటేశ్వరరావు , వనమా రాఘువ ఫ్లెక్సీలను చించివేశారు స్థానిక ప్రజలు , బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. కొత్తగూడం , పాల్వంచ తో పాటు జిల్లా  వ్యాప్తంగా వనమాను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. 

రామకృష్ణ సెల్ఫీ వీడియో, ఆయన కుటుంబం ఆత్మహత్యపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. రామకృష్ణ ఫ్యామిలీని వేధించి చంపేశాడని మండిపడ్డారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. మనుషులు ఇలా మృగాలుగా మారి వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

మంచి పాలనను అందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ, అధికారపార్టీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు.. మధ్య తరగతి ప్రజలను వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడి వల్ల ఓ కుటుంబంలోని నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఇప్పటిదాకా ఆ మానవ మృగాన్ని అరెస్ట్ కూడా చేయలేదని, ఆ కుటుంబం మీద పార్టీపరంగా చర్యలు కూడా తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమీ ఉండదన్నారు రేవంత్ రెడ్డి. 

ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎం కేసీఆర్ కు తెలియవా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాఘవ అరాచకాలు సీఎంకు తెలియకపోవడమేంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. ప్రతిపక్షాల ప్రజాపోరాటాలపైన నిఘాకే పరిమితమైందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారసులు మాఫియాను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఘటనలో వనమా వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లే పోలీసులు కూడా రాఘవను అరెస్ట్ చేయలేకపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని, రాఘవ అంత దారుణంగా మాట్లాడినా సీఎంకు ఎందుకు చర్యలు తీసుకోవాలనిపించడంలేదని ప్రశ్నించారు. ఘటనపై ప్రత్యేక న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...