రేవంత్ రెడ్డి బెయిలుకి సాంకేతిక అవరోధం

 

ఈరోజు (మంగళవారం) హైకోర్టు రేవంత్ రెడ్డి తదితరులకు బెయిలు మంజూరు చేసినప్పటికీ కోర్టు తీర్పుని టైపింగ్ చేయడంలో దొర్లిన చిన్న పొరపాటు వలన ఈరోజు జైలు నుండి విడుదల కాలేకపోయారు. తీర్పు ప్రతిలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పూచీకత్తుని ఎసిబి కోర్టుకి ఇవ్వాలని వ్రాయవలసి ఉండగా, ఎసిబికి ఇవ్వాలని టైప్ చేయడంతో ఎసిబి కోర్టు దానిని తిరస్కరించింది. కనుక రేవంత్ రెడ్డి లాయర్లు రేపు హైకోర్టులో మరొక మేమో సమర్పించి సవరణ కోరుతారు. సవరించిన తీర్పు ప్రతిని ఎసిబి కోర్టుకి సమర్పించిన తరువాత, రేవంత్ రెడ్డి తదితరులను జైలు నుండి విడుదల చేయమని ఎసిబి కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. అది జైలు అధికారులకు చేరిన తరువాత వారిని జైలు నుండి విడుదల చేస్తారు. బహుశః రేపు మధ్యహ్నంలోగా ఈ ప్రక్రియలన్నీ పూర్తయితే మధ్యాహ్నం 1-2 గంటలలోగా రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ మరియు ఉదయ్ సింహాలను జైలు నుండి విడుదల కావచ్చును. ఈరోజు ఆయన జైలు నుండి విడుదల అవుతున్నారని ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు కొందరు సన్నిహిత బంధువులు చర్లపల్లి జైలు వద్దకి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కానీ ఆయన రేపు విడుదలవుతారని తెలిసి తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.