కాంగ్రెస్ వాళ్లు చవటలు.. టీఆర్ఎస్ వాళ్లు సన్నాసులు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెదేపా మహానాడులో ఎప్పటిలాగే తన వాక్చాతుర్యాన్ని చూపించారు. మహానాడులో ప్రసంగిస్తూ ఆయన కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ గారు సర్వే పేరిట 12 గంటల్లో ఇంట్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని కోళ్లు ఉన్నాయి, ఎన్నిపందలు ఉన్నాయి అని లెక్కలు చూశారు కానీ 12 నెలలైనా అమర వీరుల లెక్కలు మాత్రం తేల్చలేకపోయారని ఎద్దేవ చేశారు. తెలంగాణ తొలి ఉద్యమంలో అసువులు బాసిన 369 మందికి, మలి ఉద్యమంలో పాల్గొన్న 1200 మంది అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమానికి నాయకత్వ వహించాడన్న ఒక్క కారణంతో కేసీఆర్‌ను నమ్మి ఆయన చేతిలో పెట్టారని అన్నారు. ఓ వైపు చవటలు కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ఇచ్చామంటారు... మరోవైపు సన్నాసులు టీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ తెచ్చినం. అంటారు. వీళ్లు ఇచ్చినప్పుడు, వాళ్లు తెచ్చుకున్నప్పుడు ఉద్యమంలో అంతమంది చావులకు కారకులెవరని ప్రశ్నించారు. ఉద్యమంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ విషయమే మర్చిపోయిందని, తాము కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. వెయ్యికోట్లు పెట్టి అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.