Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కియా కథ మళ్ళీ మొదటికి వచ్చిందా..?
posted on: Feb 10, 2020 1:11PM

కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోనుందని రాయిటర్స్ వార్తా సంస్థ ఇచ్చిన కథనంపై ఏర్పడిన గందరగోళం మరింత తీవ్రమైంది. తమ కథనానికి కట్టుబడి ఉన్నామని, కథనాన్ని తొలగించటం అవాస్తవమని రాయిటర్స్ సంస్థ స్పష్టం చేసింది. కొన్ని సవరణలతో పాత కథనాన్ని తాజాగా రీట్వీట్ చేసింది. దీనిపై ప్రభుత్వ స్పందన తెలియరాలేదు.
ఈ నెల ఐదున రాయిటర్స్ తొలిసారి కియా తరలింపుపై కథనం ఇచ్చింది. 1.1 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తరలిపోనుందని చెప్పుకొచ్చింది. ఆంధ్ర ప్రభుత్వ విధానాలు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్న కియా మోటార్స్.. తరలింపుపై తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని అందులో పేర్కొనడం.. రాష్ట్రం లోనే కాక దేశమంతటా కలకలం రేగింది. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రం నుంచి ఢిల్లీలో పార్లమెంటు దాకా విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిశ్రమల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి హడావుడిగా కియా యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం కియా ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఆ సంస్థను కూడా ఆ మేరకు ప్రకటన ఇవ్వాలి అని అడిగినట్టు తెలిసింది, దాంతో ఆ సంస్థ కూడా ప్లాంట్ ను తరలించే ఆలోచనేదీ లేదని వెళ్ళడించింది. మరుసటి రోజు కూడా మేకపాటి ఢిల్లీలో ఆటో ఎక్స్ పో లో పాల్గొని కియా ప్రతినిధులతో మాట్లాడారు. అప్పుడు రాయిటర్స్ కథనాన్ని కియా ఖండించింది. ఇదే సమయంలో వైసీపీ నేతలు టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వెల్లడంలేదని కియా స్వయంగా చెపుతున్నా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనను విమర్శించారు.
ఈలోపు శనివారం రాత్రి తన కథనాన్ని రాయిటర్స్ ఉపసంహరించుకుందని, ట్విట్టర్ నుంచి తొలగించిందని ప్రభుత్వం పేర్కొంది. దానిని రాయిటర్స్ తాజాగా తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మారిన విధానాలూ, అదే విధంగా తమకిచ్చిన రాయితీలపై ప్రభుత్వ పునరాలోచన, స్థానికులకే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనడం, ఇతరత్రా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కియా యాజమాన్యం తమిళనాడుకు తరలిపోయే ఆలోచన చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయని తన కథనంలో పేర్కొంది. ఆ సంస్థకు భూమి ఇచ్చినప్పుడు వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించే అవకాశమిచ్చారని, అదే విధంగా విద్యుత్ విషయం లోనూ రాయితీలు ఇచ్చారని ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని పునస్సమీక్ష చేస్తుండటం కియాకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని పేర్కొంది.
మరోవైపు నైపుణ్య ఉద్యోగాలు కాకుండా ఇతర వాటిల్లో స్థానికులకే ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడు నైపుణ్య ఉద్యోగాలలోను డెబ్బై ఐదు శాతం కోటా ఇవ్వాలంటే అవసరమైన నైపుణ్య మానవ వనరుల లభ్యత ఇక్కడ లేదని కియా అంటున్నట్లు తెలిసింది అని వెల్లడించింది. కాగా 1.1 డాలర్ ల వ్యయంతో నెలకొల్పిన ఇంత భారీ ప్లాంట్ ను తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్నదే. నష్టం కూడా భారీగానే ఉంటుంది, అందుకే తరలింపు ఖర్చు కూడా తమిళనాడు ప్రభుత్వం ఇస్తామంటోందని ఒక రహస్య వ్యక్తి తమకు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో కియా ప్రతినిధులు వారితో కలిసి ఉండేవారితో మాట్లాడాకే ఆ వార్తా సంస్థ తాజా ట్వీట్ చేసిందని సమాచారం. దీంతో కియా మన రాష్ట్రంలో ఖాయంగానే ఉంటుందా, ఈ ప్రచారానికి ముగింపు ఎప్పుడు అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.






