TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణా వాదానికి పరీక్ష కాబోతున్న పరకాల ఉపఎన్నిక

Published on: Thu May 17, 2012 4:42PM

తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ రాజీనామాతో ప్రారంభమైన పరకాల ఉప ఎన్నికల వేడి ఇప్పుడు ఇక్కడ పోటీలో ఉన్న అన్ని పార్టీలనూ తాకింది. సై అంటే సై అంటూ ఈ పార్టీలు ప్రచారంలోనే సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఓటర్లన్ ఉఆకట్టుకునేందుకు ఫీట్లు చేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణావాదానికి, మరోవైపు సమైక్యతారాగానికి ఈ పరకాల నియోజకవర్గం వేదికైంది. అసలు ఈ ఉప ఎన్నికలకు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి సంబంధమే లేదని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇక్కడ చేసిన సంచలనవ్యాఖ్య పార్టీల మధ్య పట్టుదలను పెంచుతున్నాయి.

 

 

ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సాంబారి సమ్మారావు , వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ, టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా భిక్షపతి రంగంలో ఉన్నారు. టి.ఆర్.ఎస్. అభ్యర్థిని ప్రకటించడంలో చేసిన జాప్యం కారణంగా ఇప్పటివరకూ బిజెపి తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఈ బరిలో ఉమ్మడి అభ్యర్థినే రంగంలో దిన్చాల్సిన అవసరం ఉందని తెలంగాణా జెఎసి ఛైర్మన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రత్యేక తలన్గానాను కోరుతూ చేసిన రాజీనామా వల్ల ఇక్కడ ఎన్నికలు వచ్చాయన్న విషయాన్ని తెలంగాణావాదులందరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. అయితే ఈయన ప్రకటన చేసిన రోజునే టి.ఆర్.ఎస్. తన అభ్యర్థి పేరును ఖరారు చేసింది.

 

 

ఈ నియోజకవర్గంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో విభేదించిన మంత్రి బసవరాజు సారయ్య అకస్మాత్తుగా లక్ష్మయ్య ఇంటికి వచ్చి తన ఐక్యతారాగాన్ని చాటుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు బిసి కులానికి చెందినవాడు. ఈయన్ని మంత్రి లక్ష్మయ్య స్వయంగా ఎంపిక చేసి పార్టీలో విభేదాలను తలపైకి తెచ్చుకున్నారు. ఈ విషయంలో రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణ మంత్రులిద్దరికీ విడివిడిగా క్లాసులు పీకటంతో ఈసారి ఎన్నికల్లో ఐక్యతగా పోటీ పెంచేందుకు వారిద్దరూ నడుంకట్టారని తెలుస్తోంది. పార్టీ ఐక్యత తమకు బలమని సిఎం, పిసిసి చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. కలిసి పని చేస్తున్నందుకు తమ విజయం నల్లేరుపై నడకలాంటిదని మంత్రి పొన్నాల, బసవరాజు ధీమా వ్యక్తం చేశారు.

 

 

ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విషయానికి వస్తే ఆయన పార్టీ క్యాడర్ తో చేసే ప్రచారాన్నే నమ్ముకున్నారు. ఈయన తాజామాజీ కొండా సురేఖపై విమర్శలు చెరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి దాకా ప్రచారంలో లేని టి.ఆర్.ఎస్. త్వరలో ప్రచారం ప్రారం భించేందుకు సన్నద్ధాలు చేసుకుంటోంది. ఈలోపు ఆ పార్టీ తరపున పలుసమావేశాలు నిర్వహించి వాటిలో వై.ఎస్,ఆర్, కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి అవినీతిని ఎండగడు తున్నారు.

 

 

రాష్ట్రంలో అన్ని పార్టీలూ టి.ఆర్.ఎస్., జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో టి.ఆర్.ఎస్. నాయకుడు కెటిఆర్ జగన్ అక్రమార్జనాలు, ఆ పార్టీ తీరుతెన్ను లపై ఘాటైన విమర్శలతో ప్రచారం సాగించారు. ఇక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఇంటింటికీ తిరిగి స్థానిక సమస్యలను ఎలా పరిష్కరించగలరో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రచారమైనా డప్పులమోతతోతోనూ, మైకుల ధ్వనులతోనూ సాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభ్యర్థులు ప్రచారం చేసుకుని రాత్రివేళల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో ప్రచార అనుభవాలను చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయిస్తున్నారు. బిజెపి కూడా ఇదే తరహాలో ప్రచారం చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పారు. ఈ పార్టీలతో కలుపుకుని ఈ నియోజకవర్గం నుంచి మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అందువల్ల ఇక్కడ ఓట్లు చీలే అవకాశాలూ, గెలిచే అభ్యర్థి తక్కువ మెజారిటీ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు తేటతెల్లం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ ప్రతిష్టకోసమైనా ఈ బరిని వదులుకోవటానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేనందున ఇక్కడ గెలవటమే ఒక పెద్ద సవాల్ అని అందరూ అంగీకరించక తప్పదు మరి!