ఆధునిక విజ్ఞానం మ‌న ఆదివాసులకు సొంతం

 


భార‌తీయుల ప్ర‌తిభ గురించి చెప్పేట‌ప్ప‌డు దిల్లీలో ఉన్న `ఇనుప స్తంభం` ప్ర‌స్తావ‌న త‌ప్ప‌క వ‌స్తుంది. వెయ్యి సంవ‌త్స‌రాల పూర్వ‌మే రూపొందించిన ఈ 23 అడుగుల స్తంభానికి తుప్పు ప‌ట్ట‌ద‌ని గొప్ప‌గా చెబుతారు. స‌రే! దిల్లీ అంటే ఎప్ప‌టి నుంచో మ‌హాన‌గ‌రంగా ఉంది. అందులో గొప్ప గొప్ప మేధావులూ ఉండిఉంటారు. కానీ దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఇలాంటి అద్భుతం ఒక‌టి దాగి ఉంది!

కొండ‌కోన‌ల మ‌ధ్య‌:

 

 

మంగ‌ళూరు నుంచి ఉత్త‌రానికి 120 కిలోమీట‌ర్లలో కొడ‌చాద్రి అనే కొండ ఉంది. కొల్లూరు అనే చిన్న ప‌ట్నానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఈ కొండ‌ను చేరుకోవాలంటే... సెల‌యేళ్ల‌నూ, అడ‌వుల‌నూ దాటుకుంటూ పెద్ద సాహ‌స‌మే చేయాల్సి ఉంటుంది. ఇక వ‌ర్షాకాలం ఈ కొండ మీద అడుగుపెడితే చాలు... జ‌ర్రున జారిపోవ‌డం ఖాయం.  ఈ కొండ మీదే పార్వ‌తీదేవి మూకాసురుడు అనే రాక్ష‌సుడిని సంహ‌రించింద‌ని న‌మ్మ‌కం. అందుకే ఆమెను మూకాంబిక పేరుతో ఇక్క‌డ ప్ర‌తిష్టించారు. ఆ మూకాంబిక గుడి బ‌య‌ట ఒక 30 అడుగుల ధ్వ‌జ‌స్తంభం ఉంది. దాదాపు 1500 సంవ‌త్స‌రాల క్రితం రూపొందించిన ఆ ఇనుప ధ్వ‌జ‌స్తంభం ఇంత‌వ‌ర‌కూ... తుప్పుప‌ట్ట‌లేదు!

 



ఆశ్చ‌ర్యం ఎందుకంటే:

 

ఇక్క‌డి వాతావ‌ర‌ణం చాలా ప్ర‌తికూలంగా ఉంటుంది. ప‌శ్చ‌మ క‌నుమ‌ల్లో భాగంగా 4,400 అడుగుల ఎత్తున ఈ కొండ ఉంది. అక్క‌డ కొండ‌గాలి ఎంత తీవ్రంగా ఉంటుందంటే, దాని శిఖ‌రం మీద గ‌డ్డి కూడా నిలిచి ఉండ‌లేదు. ఇక ఏడాదిలో దాదాపు ఎనిమిది నెల‌లు వ‌ర్షాలు ప‌డుతూనే ఉంటాయి. ఒక్క ఏడాది వ్య‌వ‌ధిలోనే ఇక్కడ 750 సె.మీల వ‌ర్ష‌పాతం కురుస్తుంది! అన్నిటికీ మించి అరేబియా స‌ముద్రం ఇక్క‌డికి కేవ‌లం 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా ఆ స్తంభం చెక్కుచెద‌ర‌లేదు. స్తంభం పైభాగంలో ఒక నాలుగ‌డుగులు త‌ప్ప మిగ‌తా స్తంభం అంతా శుభ్రంగానే ఉంది. ఆ కాస్త కూడా వ‌ర్షాకాలంలో త‌గిలే మెరుపుల వ‌ల్లే దెబ్బ‌తిని ఉంటుందంటున్నారు.

 


ప‌రిశోధ‌న‌లు:

 

కొన్నేళ్ల క్రితం క‌ల్ప‌క్కంలోని ఇందిరాగాంధి అణుప‌రిశోధ‌న సంస్థ‌కు చెందిన టి.ఆర్‌.అనంత‌రామ‌న్‌, ఈ స్తంభం నుంచి కొన్ని భాగాల‌ను సేక‌రించారు. వాటిని ప‌రిశీలించిన మీద‌ట‌... ఆ స్తంభం కేవ‌లం బొగ్గు, ముడి ఇనుము ఆధారంగా నిర్మించిన‌ద‌ని తేలింది. ఇనుము తుప్పు ప‌ట్ట‌కుండా ఉండేందుకు మ‌రే ఇత‌ర ప‌దార్థ‌మూ దీనికి క‌ల‌ప‌లేదు. అయితే ఇనుముని పోత‌పోసే గొప్ప ప‌ద్ధ‌తి ఏదో అప్ప‌టి ఆదివాసుల‌కు తెలిసి ఉంటుంద‌నీ, అందుక‌నే ఇంత చ‌క్క‌టి ఇనుప‌స్తంభాన్ని నిర్మించి ఉంటార‌ని తేల్చారు. అంటే ఒక‌నాడు మ‌న దేశంలోని మారుమూల ప్రాంతాల‌లోని నిరక్ష‌రాస్యులు కూడా అద్భుతాలు సాధించార‌ని ఈ స్తంభం త‌లెత్తి చెబుతున్న‌ట్లే క‌దా!

ఈ ధ్వ‌జ‌స్తంభం మూకాంబిక అమ్మ‌వారి త్రిశూలంలోని ఒక భాగ‌మే అంటారు అక్క‌డి భ‌క్తులు. మ‌రి విజ్ఞానాన్ని మించిన ఆయుధం లేదు క‌దా!

- నిర్జ‌ర‌.