జంతువులూ మనిషి సాయాన్ని కోరతాయి

మనిషికి ప్రకృతి మీద చాలా ఆధిపత్యమే ఉండి ఉండవచ్చు. కానీ తన మనుగడ కోసం అతను ఇతర జంతువులు మీద ఆధరపడక తప్పలేదు. ఇప్పుడంటే అన్ని రకాల పనులకీ, అన్ని రకాల యంత్రాలు వచ్చేశాయి. కానీ ఒకప్పుడు కుక్కలు, గుర్రాలు, ఆవు లాంటి జీవుల సాయం లేకుండా మనిషి జీవితం గడిచేది కాదు. మనిషి ఎలాగైతే ఇతర జీవుల మీద ఆధారపడ్డాడో, మనిషి మచ్చికకు అలవాటు పడిన జీవులు కూడా అతని మీద ఆధారపడ్డాయని శాస్త్రవేత్తల వాదన. పైగా అతని చర్యలని అర్థం చేసుకోవడాన్ని అవి అలవాటు చేసుకున్నాయనీ వారి నమ్మకం. అందుకు అనుగుణంగానే కుక్కల మీద చేసిన కొన్ని పరిశోధనలలో, అవి తమ యజమానుల హావభావలను అద్భుతంగా అర్థం చేసుకోగలవని తెలిసింది. అలా తమ యజమాని మనసు ఎరిగి మసులుకోవడం వల్లే కుక్కలు మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా నిలిచిపోయాయట.

 

కుక్కల సంగతి సరే! మరి జంతువుల మాటేంటి! అన్న అనుమానం వచ్చింది జపానుకి చెందిన కొందరు పరిశోధకులకి. ఎందుకంటే దాదాపు ఆరువేల సంవత్సరాలుగా మనిషి గుర్రాలను మచ్చిక చేసుకుంటూనే ఉన్నాడు. ఇన్నేళ్లలో వారిమధ్య ఏదో ఒక బంధం ఏర్పడకపోదు కదా! అందుకనేనేమో గుర్రపు స్వారీ చేస్తూ ఉండటం వల్ల మనిషి మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంగా ఉంటాడని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మరి గుర్రాలు మనిషిని ఏమేరకు అర్థం చేసుకోగలుగుతున్నాయి! అన్న ఆలోచనతో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు.

 

పరిశోధకులు ఒక గుర్రపుశాలలోని ఓ బకెట్‌లో కొంత ఆహారాన్ని ఉంచారు. ఆహారం ఎక్కడ ఉంది అన్న విషయం గుర్రానికి తప్ప దాని సంరక్షకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఎప్పుడైతే సంరక్షకుడు ఆ గుర్రాన్ని చేరుకున్నాడో, గుర్రం అతడిని ఫలానా చోట ఆహారం ఉంది... అది నాకు అందించు అన్నట్లుగా అతడిని ఆహారం దిశగా తోస్తూ అనేక హావభావాలను ప్రదర్శించింది.

 

ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని మరోవిధంగా చేశారు. ఈసారి ఆహారం ఎక్కడ ఉందో సంరక్షకుడికి కూడా తెలిసేలా జాగ్రత్తపడ్డారు. అప్పుడు కూడా గుర్రం తనకి ఆహారం అందించమంటూ సంజ్ఞలు చేసింది కానీ... ఆ సంజ్ఞలలో మునుపటి తీవ్రత లేదు. అంటే తన సంరక్షకుడిని నిశితంగా గమనించడం ద్వారా అతనికి ఆహారం గురించి తెలుసో లేదో అన్న విషయాన్ని కూడా గుర్రాలు గ్రహించగలుగుతున్నాయన్నమాట. జీవి మనుగడ సాగించేందుకు ఈ నేర్పు చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. చింపాంజీల వంటి ఉన్నతశ్రేణి జీవులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తన ఎదురుగా ఉన్న జీవి హావభావాలను బట్టి, అతను చూసే చూపుని బట్టి... అతనికి ఒక విషయం తెలుసా లేదా! అతను ఏదన్నా ప్రమాదాన్ని పసిగడుతున్నాడా అన్న విషయాన్ని అవి గ్రహించగలుగుతాయి. 

 

ఇంతకీ పోయిపోయి గుర్రాల మీద ఈస్థాయి పరిశోధనలు చేయడం వల్ల ఉపయోగం ఉందా అంటే లేకం అంటున్నారు పరిశోధకులు! మనిషికి దగ్గరగా ఉండటం వల్ల పెంపుడు జంతువుల గ్రహణశక్తిలోనూ, ప్రవర్తనలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో గ్రహించడం వల్ల మనిషికీ, అతను మచ్చిక చేసుకున్న జంతువులకి మధ్య సంబంధాన్ని గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చునని అంటున్నారు.

 

- నిర్జర.