చార్మినార్ పై నీలినీడలు ... చారిత్రిక కట్టడాలపై పాలకుల నిర్లక్ష్యం ..

posted on: May 18, 2012 2:41PM

ప్రపంచఖ్యాత చార్మినార్ విషయంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనబడుతోంది. ఈ నీలినీడలు ఆపేవారు లేరా అని చారిత్రికపరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నాలుగుస్తంభాల కట్టడం ఇండో-ఇరాన్ సంస్కృతుల మేళవింపు. నాటి రాచరికానికి అద్దం పట్టే ఈ కట్టడానికి నగిషీలే అందం అటువంటి నగిషీలు ఊడిపోతున్నాయి. సిమ్మెంటు పెచ్చులు మీద పడటంతో ఇటీవల చార్మినార్ పక్కనుంచి వెళ్ళే వాహన చోదకులూ గాయపడ్డారు. ఈ కట్టడాన్ని సంరక్షించేందుకు పురావస్తుశాఖ ఎటువంటి చర్యలూ చేపట్టకపోవటం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. క్రీ.శ. 1591లో సుల్తాన్ కులీకుతుబ్ షా దీన్ని నిర్మించారు. ఈయన కుతుబ్ షాహీవంశంలో ఐదొవాడు. చార్మినార్ నిర్మించాక తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్ కు మార్చారు. ఈ కట్టడం ఒకేసారి వేలమంది ప్రార్థన చేసుకునేందుకు వీలైన మస్జీద్ గా ఇది పేరొందింది. ఇందులో నాలుగుస్తంభాలు ఉండటం వల్ల చార్ (నాలుగు) మినార్ (స్తంభాలు)గా ప్రపంచఖ్యాతి గడించింది.

 

 

చరిత్రపుటల్లో హైదరాబాద్ సంస్థానం గురించి ప్రస్తావించాలంటే చార్మినార్ అందం గురించి చెప్పాల్సిందే. ఈ నిర్మాణానికి 1824లో మరమ్మత్తులు రూ. 60వేలతోనూ, మరో లక్షరూపాయలతో ప్లాస్టరింగ్, లైటింగ్ లు చేశారు. చార్మినార్ మార్కెట్టులో 14వేల షాపులున్నాయి. యాత్రికులను ఆకట్టుకునే హైదరాబాద్ ముత్యాలు, బంగారునగల వ్యాపారం జరిగే లాడ్ బజార్, ఫత్తర్ ఘట్టి చార్మినార్ కు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. కుతుబ్ షాహీ వంశస్థులు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పటికీ ఆ దేశరాజధాని కరాచీలోని బహాదూరాబాద్ లో ఓ మినీ చార్మినార్ ను నిర్మించారు. అయితే హైదరాబాద్ లోని చార్మినార్ కు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చారిత్రిక కట్టడాన్ని రక్షించేందుకు కృషి చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. టూరిజం శాఖకు చార్మినార్ పునర్నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే ఇంకా స్పందించలేదని చార్మినార్ కన్జర్వేషన్ అధికారి రషీద్ ఖాన్ తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...