బంగారం ధర ఎందుకు తగ్గుతోంది?

పసిడికాంతులు వెలవెలబోతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఆకాశంలో ఉన్న బంగారం ధర ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతేకాదు పసిడి ఇంకా దిగివచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం ధర తగ్గుముఖం పట్టణంలో సాధారణ వినియోగదారులు సంతోషిస్తుంటే...దానిపై భారీగా పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు.


        2012 లో బంగారం అన్నిహద్దులు దాటేసింది. రికార్టు స్థాయి ధరను నమోదు చేసింది. ఏకంగా తులం బంగారం 33 వేల మార్కుకు చేరింది. అప్పుడున్న దూకుడు చూసి ఇంకా పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత అదే స్థాయిలో కాకపోయినా పసిడి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 25,500 కు పడిపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంకా తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు.


        బంగారం రేటు తగ్గడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ఎఫెక్ట్ బాగా ఉంది. ముఖ్యంగా ఉద్దీపనా పథకాలకు స్వస్తి చెబుతున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. అక్కడి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఇదే. ఇప్పుడదే ప్రభావం బంగారు రేటుపైనా పడింది. గోల్డ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలో ముడి చములు ధరలు బాగా తగ్గాయి. అటు చైనాలో డిమాండ్ బాగా తగ్గింది. గతంలో ధర తగ్గిన ప్రతిసారి చైనా భారీగా బంగారాను కొనుగోలు చేసింది. కానీ ఈసారి మాత్రం చైనా నుంచి సానుకూల స్పందన లేదు. అన్నింటికి మించి మోడీ సర్కార్ వచ్చాక భారత్ లో పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ముడిసరుకు ధర తగ్గడం కలిసొచ్చింది. రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండడంతో పాటు బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోందంటున్నారు మార్కెట్ పరిశీలకులు.