టీడీపీ డైరెక్షన్లో కేఏ పాల్.. వైసీపీకి బిగ్ లాస్!!

 

సీరియల్ మధ్యలో యాడ్ లాగా, సినిమా మధ్యలో కామెడీ ట్రాక్ లాగా.. అప్పుడప్పుడు రాజకీయ తెర మీద కనిపించే  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ మళ్ళీ తెర మీదకు వచ్చారు. తనని చూసి మిగతా నాయకులు భయపడుతున్నారని, తానే ఏపీకి కాబోయే సీఎం నని మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నారు. ఆయన చెప్పే మాటలకు ఓట్లు వస్తాయో రావో తెలీదు కానీ.. ఆయన మాటల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన మాటలు విని కొందరు నవ్వుకుంటున్నారు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారు. కేఏ పాల్ వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

కేఏ పాల్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం అవడం కష్టం కానీ.. పోటీ చేస్తే ఆయన పార్టీకి ఎంతో కొంతైనా క్రిస్టియన్ ఓట్లు పడే అవకాశముంది. అసలే వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా  ఉండనుంది. మరి అలాంటప్పుడు కేఏ పాల్ వంటి వారు చీల్చే కొద్ది ఓట్లు కూడా ఫలితాల మీద ప్రభావం చూపుతాయి. అదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. టీడీపీకి మొదటినుంచి క్రిస్టియన్ ఓటు బ్యాంకు అంతగా లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా క్రిస్టియన్ ఓట్లలో మెజారిటీ  ఓట్లు వైసీపీకి పడ్డాయనే అభిప్రాయముంది. దీనిబట్టి చూస్తుంటే కేఏ పాల్ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి కొత్తగా వచ్చే నష్టమేమి లేదు. నష్టమేదైనా ఉంటే వైసీపీకనే చెప్పాలి.

కేఏ పాల్ ఎన్నికల బరిలోకి దిగితే కొద్దో గొప్పో క్రిస్టియన్ ఓట్లు పడతాయి తప్ప ఆయనకీ ఒరిగేదేమి లేదు. ఈ విషయం కేఏ పాల్ కి కూడా తెల్సే ఉంటుంది. అయినా కూడా అయన నేనే సీఎం అంటూ అంతలా ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఆయన వెనుక ఎవరైనా ఉండి ఇదంతా నడిపిస్తున్నారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే వైసీపీ ఓట్లు చీల్చేందుకే టీడీపీ కేఏ పాల్ ని తెరమీదకు తెచ్చిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నాలుగున్నరేళ్ళుగా కనబడని కేఏ పాల్ ఇప్పుడు ఎందుకు హడావుడి చేసున్నారు ? వైసీపీకి పడే పది ఓట్లలో కనీసం కేఏ పాల్ ఒకటి, రెండు ఓట్లు ఆపినా ఆమేరకు లాభపడేది టీడీపీ నే. కాబట్టి టీడీపీనే కేఏ పాల్ ను తెరపైకి తెచ్చి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో కేఏ పాల్ కే తెలియాలి.