అధికారుల అలసత్వమా? బోటు సిబ్బంది నిర్లక్ష్యమా? బోటు ప్రమాదానికి కారణమెవరు?

 

బోటు ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరిలో అధిక నీటి ప్రవాహమే బోటు బోల్తాకి ప్రధాన కారణమని అంటున్నా, అధికారుల అలసత్వం, బోటు సిబ్బంది నిర్లక్ష్యమే కొంపముంచినట్లు తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో పాపికొండలకు బయల్దేరడం అదిపెద్ద తప్పు అయితే, ప్రయాణికులు అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంతో మరో ఘోర తప్పిదంగా కనిపిస్తోంది. అలాగే అనుభవం లేని డ్రైవర్లు, బోటు సిబ్బంది కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోవడం... మలుపు దగ్గర చాకచక్యంగా వ్యవహరించలేకపోవడంతో... సుడిగుండాలకు బోటు బోల్తా కొట్టిందని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. అయితే, బోటు మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు... రెండో అంతస్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రయాణికులు ఒక్కసారిగా కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్లడంతో బోటు బ్యాలెన్స్ తప్పి, బోల్తాపడిందని అంటున్నారు.

ఇదిలాఉంటే, ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పర్యాటకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే, రాయల్ వశిష్ట ప్రైవేట్ బోటును నడుపుతున్నట్లు గుర్తించారు. పైగా ఐదు లక్షలు పైగా ఇన్‌ ఫ్లో ఉండగా, పాపికొండలకు బోటు బయల్దేరడం అతిపెద్ద తప్పిదంగా అధికారులు తేల్చారు.