రాయలసీమ ప్రజలను రెచ్చగొడుతున్నదెవరు?
posted on Aug 12, 2014 12:52PM
.jpg)
రాజధాని కోసం కర్నూలు రాజధాని సాధన సమితి నేతృత్వంలో ప్రజలు ‘లక్ష గొంతుల పొలికేక’ పేరిట నిన్న కదం తొక్కారు. రాష్ట్రంలో వెనుకబడిన తమ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని లేకుంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తడం తధ్యమని నిన్న ర్యాలీలో పాల్గొన్న కొందరు నేతలు హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాల గురించి అందరికీ తెలుసు. అటువంటి ప్రజలు నేడు తమ ప్రాంతంలో రాష్ట్ర రాజధానిని నిర్మించక పోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని చెపుతున్నారంటే నమ్మశక్యంగా లేదు.
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతటి దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటోందో కళ్ళారా చూస్తూ కూడా వారు మళ్ళీ మరోమారు రాష్ట్ర విభజన కోరుకొంటున్నారంటే, అది వారి తీరని ఆవేదనకు అద్దం పడుతోందని భావించాల్సి ఉంటుంది లేదా కొందరు స్వార్ధ రాజకీయ నేతలు అధికారం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నట్లు అనుమానించవలసి వస్తుంది.
అధికారం కోసం అల్లలాడిపోతున్న కొందరు రాజకీయ నేతలు ప్రజాస్వామ్యబద్దంగా అధికారంలోకి రాలేమని గ్రహించి విచ్చినకర పద్దతులు అవలంభిస్తే, అటువంటి వారిని ప్రజలే నిలదీయాలి. కొందరు నేతల స్వార్ధం కోసం దేశాన్ని, రాష్ట్రాలను ఈ విధంగా విభజించుకొంటూ పోయినట్లయితే చివరికి ఏమవుతుందని విజ్ఞులయిన ప్రజలే ఆలోచించుకోవాలి. రాష్ట్ర విభజన, రాజధాని కనీసం జిల్లా గురించి గురించి ఏమాత్రం అవగాహన లేని విద్యార్దులను సైతం ఇటువంటి ఆందోళనలో పాలుపంచుకొనేలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అని ఆలోచిస్తే తెర వెనుక రాజకీయ హస్తాలున్నాయని అర్ధమవుతుంది.
రాష్ట్రవిభజనతో ఒకసారి చాలా దారుణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, స్వార్ధ రాజకీయ నాయకులకు, పార్టీల మాయమాటలు నమ్మి మళ్ళీ విభజనకు ఉద్యమిస్తే దానివలన నష్టపోయేది సామాన్య ప్రజలే తప్ప రాజకీయ నాయకులు కాదు. ఇది కళ్ళెదుట ప్రత్యక్షంగా కనబడుతున్న చరిత్ర.
ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులతో కూడిన ఒక వ్యవస్థ. కనుక వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా తమతమ ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేసినట్లయితే మిగిలిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందగలవు. కానీ ప్రజా ప్రతినిధులు తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోకుండా రాష్ట్రవిభజన జరగాలని కోరుకొంటే అది క్షమించరాని నేరం. అందువల్ల రాజధానిని ఎక్కడ నిర్మించినప్పటికీ ప్రజలందరూ తమ తమ జిల్లాల అభివృద్ధి జరిగేలా ప్రజాప్రతినిధులపై గట్టిగా నిరంతరం ఒత్తిడి తేవడమే మంచి పద్ధతి.