నిర్భయలు ఎందరో!

 


అత్యాచారం అనేది చాలా తీవ్రమైన నేరమే కావచ్చు. కానీ అదే నేరం మాటిమాటికీ ఏదో ఓ మారుమూల ప్రాంతంలో జరుగుతూనే ఉంటే... ప్రజలూ, ప్రభుత్వం కూడా మొద్దుబారిపోతారేమో! సవాలక్ష వార్తల్లో ఇది కూడా ఒకటే కదా అని సర్దుకుపోతారేమో! కానీ ఆ నిర్లిప్తతే మన జాతిని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకపోతే మనది గొప్ప సంస్కృతి అనే కాదు, మనం మనుషులం అని చెప్పుకునే అర్హత కూడా మిగలదు.

 

ఏప్రిల్‌ 28: పట్టపగలు. జిషా అనే 29 ఏళ్ల అమ్మాయి కేరళలోని మారుమూల గ్రామమైన పెరుంబవూర్‌లోని తన సొంత ఇంట్లో ఉంది. అకస్మాత్తుగా ఆ ఇంటి తలుపులను తోసుకుంటూ ఎవరో లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన మృగం చేయరాని అకృత్యాలన్నీ చేసింది. జిషాను కొరికికొరికి అనుభవించి, పొడిచి పొడిచి చంపింది. జిషా తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు రక్తపుమడుగులో అపస్మారకంగా పడి ఉంది. తన కూతురిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ ఆమె వేసిన కేకలని కూడా ఎవరూ పట్టించుకోలేదు.

 

జిషా ఒక దళిత యువతి. ఎప్పటికైనా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నది ఆమె ఆశగా ఉండేది. కానీ అరకొర ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు కూడా మందకొడిగా సాగేది. చదువు పూర్తయ్యేలోగానే ఆమె జీవితమే ముగిసిపోయింది. జిషాది మొదటి నుంచీ ఓ విషాద యాత్రే! ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగానే తండ్రి వాళ్లని వదిలి వెళ్లిపోయాడు. ఆ ఘటనకో ఏమో తల్లికి అప్పుడప్పుడూ మతిస్థిమితం తప్పుతూ ఉండేది. అయినా జిషా చాలా నిబ్బరంగా, తన పనేదో తాను చూసుకుంటూ సాగిపోయేదని చుట్టుపక్కల వారు చెబుతారు. దగ్గర్లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తూ, చదువుని ఎలాగొలా కొనసాగించాలని ఆశపడుతూ, ఓ పక్కా ఇంటి కోసం కలలు కంటూ జీవితాన్ని గడిపేసేది. జిషాకి ఇప్పుడు కలలు కనే అవకాశం కూడా లేకుండా పోయింది. జిషాని పైశాచికంగా అనుభవించి చంపి నిటారుగా నడుచుకుంటూ పోయిన ఆ మనిషిని ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు.

 

జిషా కుటుంబం మీద కక్షతోనే ఎవరో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని కొందరి అనుమానం. అసలు ఈ నేరానికి పాల్పడింది ఒక్కరా లేక ఇద్దరా అన్నది మరి కొందరి సందేహం. కానీ ఒక్కటి మాత్రం నిజం! జిషాను పట్టపగలు, ఆమె స్వంత ఇంట్లో అత్యాచారం చేసే అవకాశం ఉండటం నిజంగా దురదృష్టకరం. నేరస్తుడికి ఆ అలుసు మన సమాజమే కల్పించింది. మామూలు రోజుల్లో అయితే జిషా మరణం మరో వార్తగా మిగిలిపోయేదేమో! కానీ కేరళలో ఎన్నికలు జరుగుతుండటంతో, ఈ ఘటనను ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించసాగారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు హుటాహుటిని వెళ్లి జిషా తల్లిని పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి పది లక్షల సాయం, ఎప్పుడో దూరమైన జిషా సోదరికి ప్రభుత్వోద్యోగం కల్పిస్తామని ప్రకటించేశారు. కేరళలో ఉన్న దారుణమైన పరిస్థితులకు జిషా ఘటనే ఓ ఉదాహరణ అని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టాయి.

 

నిజానికి కేరళలో స్త్రీల పట్ల నేరాలు కొత్తేమీ కాదు. మా రాష్ట్రంలో మానవాభివృద్ధి చాలా అద్భుతమని ఆ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ, పొరుగు రాష్ట్రాల్లో పోలిస్తే అక్కడ ఇలాంటి ఘటనల సంఖ్య ఎక్కువే! అక్షరాస్యతలోనూ, ఇంటిని నిభాయించుకోవడంలోనూ అక్కడి మహిళలు ముందుంటున్నప్పటికీ... వారి మీద జరుగుతున్న అత్యాచారాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కేరళలను విడతలవారీగా ఏలుతున్న సీపీఎం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే దీనికి కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరువాత ప్రభుత్వాలన్నీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాయనీ అంతా ఆశించారు. అందుకు తగినట్లుగానే చట్టాలలో తీవ్రమైన మార్పులనూ తీసుకువచ్చారు. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా అవి నేరాలను ఏమాత్రం అదుపు చేయలేకపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ దేశ రాజధాని దిల్లీలోనే, అత్యాచారం అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో 83 శాతం మంది ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకోగలుగుతున్నారని లెక్కలు కనిపిస్తున్నాయి. పోలీసుల దగ్గర్నుంచీ న్యాయవాదుల వరకూ అత్యాచారాన్ని చాలా సహజమైన చర్యగా భావించడంతో కేసులు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇదిగో! ఇలా ఎప్పుడన్నా జిషాలాంటి ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు, కొన్నాళ్లు దాని మీద చర్చ జరగుతూ ఉంటుంది. అప్పుడు కూడా అటు మీడియా, ఇటు రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు అనుగుణంగా ఇలాంటి ఘటనను వాడుకోవడంతోనే కాలం గడిచిపోతుంది.

 

జిషా సంఘటన జరిగిన కొద్ది రోజులకి కేరళలోనే మరో ఘటన జరిగింది. నర్సింగ్‌ శిక్షణను తీసుకుంటున్న ఓ వైద్య విద్యార్థిని మీద ఆటోలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఆటో డ్రైవరు బాధితురాలకి పరిచయస్తుడే కావడం గమనార్హం. దీనిని బట్టి ఒక విషయం స్పష్టంగా తేలిపోతోంది. పట్టపగలైనా, ఇంట్లో ఉన్నా, నడి రోడ్డు మీద ఉన్నా, తెలిసినవారితో ఉన్నా.... ఆడవారికి రక్షణ లేదన్న భయం స్పష్టమవుతోంది. కేవలం చట్టాలకు పదును పెట్టడం వల్ల ఈ భయం తీరిపోదు. వాటిని అమలుచేయడంలోనూ అంతే కఠినంగా ఉండాలి. హెల్ప్‌లైన్లు, ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు, ప్రత్యేక వైద్య విభాగాలు, 24X7 సిద్ధంగా ఉండే ప్రత్యేక పోలీసు యంత్రాంగం.... ఇలా చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రతి విభాగాన్నీ పదునెక్కించాల్సి ఉంది. లేకపోతే నేరం చేసి తప్పించుకోవడం, దొంగా పోలీసు ఆట ఆడుకున్నంత తేలికగా మారిపోతుంది.