Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మతాలన్నీ మోక్షానికి వేర్వేరు మార్గాలు అని చెప్పిన ఆధ్యాత్మిక సాధకుడు.
posted on: Feb 18, 2025 9:30AM
.webp)
పుట్టిన ప్రతీ మనిషి ఈ సృష్టిని ఒక శక్తి నడిపిస్తుందని, ఆ శక్తి దేవుడే అని రకరకాల పేర్లతో, రూపాలతో కొలుస్తూ ఉంటారు. అయితే భగవంతుని గురించి అన్వేషించటాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లి, సాదారణ మనిషి భాషలో భగవంతుని రహస్యాన్ని వెల్లడించిన మహానుభావుడు శ్రీ రామకృష్ణ పరమహంస. సత్యాన్ని అన్వేషించడమెలాగో ఆయన తన జీవితం ద్వారా చెప్పారు. ఉపనిషత్తులు, ఋషులు చెప్పే సత్యం ఒక్కటే. వివిధ మత పండితులు దాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారని రామకృష్ణ పరమహంస చెబుతారు. 19వ శతాబ్దపు మధ్యలో జన్మించిన శ్రీ రామకృష్ణ మతాలన్నీ కూడా తమ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆ పరమ సత్యం తెలుసుకునే వివిధ మార్గాలేనని గ్రహించి, ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన జీవితం ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల అని చెప్పవచ్చు. ఫిబ్రవరి 18 , 1836లో జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు గురించి మరింత తెలుసుకుంటే..
శ్రీ రామకృష్ణ పరమహంస....
రామకృష్ణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ విద్యలో మాత్రం అంతగా రాణించలేదు. ఆయన బెంగాళీ భాష మాత్రమే మాట్లాడగలిగేవారు. ఇంగ్లీష్, సంస్కృత భాషలు తెలియవు. 1843లో ఆయన తండ్రి మరణించడంతో, ఆయన అన్నయ్య రామ్‌కుమార్ కుటుంబ బాధ్యతలు చేపట్టారు. పేదరికం వల్ల రాంకుమార్, రామకృష్ణలిద్దరూ కలకత్తా కాళికామాత ఆలయంలో పురోహితులుగా చేరారు. రామకృష్ణ 23 ఏళ్ల వయసులో శారదా దేవిని వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె ఐదేళ్ల చిన్నారి. ఆ తర్వాత ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల ఈ వివాహం భౌతికంగా కొనసాగలేదు. అయినప్పటికీ మరణించేవరకు ఇద్దరూ కలిసి జీవించారు. 1856లో అన్నయ్య రాంకుమార్ మరణించడంతో, రామకృష్ణ పూర్తిగా కాళీ మాత ఆరాధనలో నిమగ్నమయ్యారు.
ఆధ్యాత్మిక అన్వేషణ- కాళీ మాత దర్శనం..
ఆయన నిరంతరం కాళీమాత ఆరాధనలో ఉండేవారు.. కాళీమాతను అమ్మగా భావించేవారు.. అమ్మా అమ్మా అంటూ కాళీమాత ప్రత్యక్ష దర్శనం కోసం గంటల తరబడి ఏడ్చేవారు. భగవంతుని దర్శనం కోసం ఆరాటపడ్డారు. ఆయన శరీరమంతా విపరీతమైన మంటని అనుభవించేవారు. ఆ మహాతల్లి ఎందుకు ప్రత్యక్షం కావడం లేదని బాధపడుతూ, ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితికి చేరుకున్నారు. చివరికి ఆయనకి కాళీమాత దర్శనమయ్యిందని, ఆ ప్రత్యక్ష దర్శనాన్ని అనుభవించినప్పుడు అపారమైన కాంతి సముద్రంలో లీనమైపోయారని చెబుతారు.
వివిధ మతాల్లో సాధన- సర్వ మత సమానత్వ భావన..
తన తొలి దర్శనానంతరం, రామకృష్ణ అనేక ఇతర మత పద్ధతుల్లో కూడా ఆధ్యాత్మిక సాధన చేయటం ప్రారంభించారు. వైష్ణవం, శక్త సంప్రదాయం, అద్వైత వేదాంతం, ఇస్లామిక్ సూఫీ సంప్రదాయం, రోమన్ కాథలిక్ క్రైస్తవం వంటి అన్ని మార్గాలను అనుసరించి అన్ని మతాలు సాధన చేసిన తర్వాత కూడా ఆయనకు ఒకేలాంటి పరబ్రహ్మం అనుభూతి కలిగింది. క్రైస్తవులు దేవునిగా కొలిచే యేసు ప్రభువు కూడా ఒక యోగిలాగానే కనిపించి ఆయనను హత్తుకొని అనంతంలో కలిసిపోయినట్టు ఒక దివ్య దర్శనం కలిగింది. అందుకే శ్రీ రామకృష్ణ అన్ని మతాలు ఒక్కటే, అందరి అన్వేషణకి అంతిమ స్థానం ఒకటేనని చెప్పారు. ఆయన సందేశం "అన్ని మతాలూ ఒకే దివ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి వేర్వేరు మార్గాలు" అనే దానికి పునాది వేసింది.
గురువుకు తగ్గ శిష్యుడు స్వామి వివేకానంద..
అన్ని మతాలూ ఒకే భగవంతుని వైపు దారి తీస్తాయని, సనాతన ధర్మం ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియ పర్చాలని, ప్రతి వ్యక్తిలోనూ ఉండే దివ్యత్వాన్ని గుర్తించాలని, కేవలం గ్రంథాల పరిశీలన కాకుండా ఆచరణ ద్వారా భగవంతున్ని అనుభవించాలని చెప్పిన రామకృష్ణ సందేశాన్ని ఆయన తర్వాత ఆయన శిష్యులు గ్రంథాలు రాయటం ద్వారా, మఠాలు ఏర్పాటుచేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. వీరిలో స్వామి వివేకానంద ప్రముఖుడు. స్వామి వివేకానంద జీవించినది చాలా తక్కువ కాలమే అయినా ఆయన భారతీయ సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా భారతీయ యువతను చాలా ప్రభావితం చేశారు.
శ్రీ రామకృష్ణ జీవితం, ఆయన బోధనలు ఆధ్యాత్మికతపై ఒక అపూర్వమైన అధ్యాయం. ఆయన హిందూమతానికి అతీతంగా, అన్ని మతాలకూ ప్రేరణనిచ్చే సమన్వయ దార్శనికుడు. అందుకే ఆయన ఒక పరమ పురుషుడు, నిజమైన వేదాంత జీవన మూర్తి!
*రూపశ్రీ






