రామ్ గోపాల్ వర్మ మస్కా పాలిష్

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాల బాగా పనిచేస్తున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసారు. అంతే కాదు ఆయన మహాత్మా గాంధీ, బాల్ థాక్రేల కంటే కూడా చాలా బెటర్ అని మరో సర్టిఫికేట్ జారీ చేసారు. అంతే కాదు ఆయన చంద్రబాబు కంటే కూడా చాలా బెటర్ అని, అందువల్ల కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని హితబోధ కూడా చేసారు. కానీ తను చంద్రబాబును తప్పు పట్టడం లేదని సర్దిచెప్పుకొన్నారు. పనిలోపనిగా తను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలంగాణవాడినని తన స్థానికతను నిర్దారిస్తూ ఒక సెల్ఫ్ అఫిడవిట్ కూడా జారీ చేసారు.

 

వర్మ పేర్కొన్న విషయాలలో కేసీఆర్ పనితనం ఆయనకు బాగా నచ్చిందని, చంద్రబాబు పనితీరు నచ్చలేదని అర్ధమవుతోంది. కానీ మధ్యలో గాంధీజీ ప్రస్తావన చేయడం దేనికో తెలియదు. సాధారణంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా అటువంటి మహనీయునితో పోల్చి చూసుకొనే సాహసం చేయరు. కానీ తన ట్వీటర్లకి ఎంతటి మహాత్ముడు అయినా అలుసే అన్నట్లు ఉంది వర్మ వ్యవహారం.

 

ఇక గాంధీజీ కులమతాలకు అతీతంగా దేశాన్నిపటిష్టంగా కలిపి ఉంచేందుకు కృషి చేస్తే, బాల్ థాక్రే ప్రాంతీయవాదాన్ని ఎగద్రోసి, ముంబైలో మహారాష్ట్రేతరులు ఉండకూడదని గట్టిగా వాదించేవారు. ఇతర రాష్ట్రాలవారిని చాలా భయ బ్రాంతులకు గురిచేసారు కూడా. కేసీఆర్ ని గాంధీ కంటే మిన్న అని పొగిడిన నోటితోనే మళ్ళీ బాల్ థాక్రేతో పోల్చి చూపడం ద్వారా కేసీఆర్ ను పొగుడుతున్నట్లు కాక ఆయనకు చురకలు వేస్తున్నట్లుంది వర్మ తీరు.

 

తెలుగు ప్రజలు అందరూ కూడా ఇంతవరకు ఆయనను ఆంధ్రాకు చెందిన వ్యక్తిగానే భావిస్తున్నారు. కానీ అది తప్పని ఇప్పుడు వర్మ ప్రత్యేకంగా పనికట్టుకొని చాటింపు వేసుకొన్నారు. అయితే ఇంతకాలం వర్మకు గుర్తుకురాని తన ‘స్థానికత’ సరిగ్గా ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందో? ఆ విషయాన్ని ఈవిదంగా ఎందుకు ప్రకటించుకోవలసి వచ్చిందో ఆయనకే తెలియాలి. అయితే నాగార్జున వంటి కొందరు సినీ ప్రముఖులు పనిగట్టుకొని వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుష్పగుచ్చాలు ఇచ్చినా అవేవీ వారి భూములను కాపాడలేకపోయాయి. అందువల్ల వర్మ ట్వీటర్ ద్వారా కేసీఆర్ కి ఎంతమస్కా పాలిష్ కొట్టినా బహుశః ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చును. బహుశః అందుకేనేమో ముందు జాగ్రత్తగా తను తెలంగాణాలో పుట్టిపెరిగానని వర్మ చెప్పుకొన్నారు. కానీ ‘1956 నిబంధన’ తనకు వర్తిస్తుందో లేదో ఓసారి వెరిఫై చేసుకొన్నాక, ఎవరిని పొగిడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో నిశ్చయించుకోవడం మంచిది.

 

ఇక ఆయనకు చంద్రబాబు నాయుడు పనితీరు నచ్చకపోవడమనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కనుక అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచే ఆ విదంగా మాట్లాడటమే చాలా తప్పు. ముంబైపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి ఆధారంగా సినిమా తీసిన తరువాత తన ఆలోచనలలో, వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందని వర్మ ఇదివరకు చెప్పుకొన్నారు. కానీ అటువంటి మార్పులేవీ ఆయనలో రాలేదని, రాబోవని ఆయన ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.