చిరంజీవి సెక్యురిటీ సిబ్బంది దుర్వినియోగం

 

చిరంజీవి సెక్యురిటీ సిబ్బంది దుర్వినియోగం గత ఆదివారం టాలివుడ్ నటుడు రాం చరణ్ తేజ్ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తన తండ్రి సెక్యురిటీ సిబ్బంది చేత చితక బాదించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ తానూ అసలు కారు లోంచి కాలు క్రిందకు పెట్టలేదని, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో ఎటువంటి వాగ్వాదం చేయలేదని, తన సెక్యురిటీ సిబ్బంది ఆ యువకులకు నచ్చజెప్పబోతే వారు తిరగబడినందుకే తన సిబ్బంది కూడా వారిని కొట్టారని, జరిగిన దానిలో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినప్పటికీ కూడా తానూ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేస్తే వారి ఉద్యోగాలు పోతాయని జాలితో పిర్యాదు చేయలేదని వారిపట్ల ఔదార్యం కూడా ప్రకటించాడు. ఈ విషయం మీడియాలో రాకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ తనను ఇద్దరు విలేఖరులు బ్లాక్ మెయిల్ చేసినా కూడా లొంగకపోవడంతో, వారు చివరికి ఈ విధంగా మార్ఫింగ్ చేయబడిన తన ఫోటోలు మీడియాలో ప్రచురించారని అతను ఆరోపించాడు. ఆ యువకులు క్షమాపణ కోరారని కూడా చెప్పాడు.

 

కళ్ళకు కట్టినట్లు వాస్తవాలన్నీ కనబడుతున్నపటికీ, రామ్ చరణ్ తేజ్ ఈ విధంగా ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం చెపుతూ తన పరువే కాక తన తండ్రి పరువు కూడా తీస్తున్నాడు. ఇక ఈ సంఘటనలో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కేంద్రమంత్రి చిరంజీవికి ప్రభుత్వం కేటాయించిన ఇంటలిజన్స్ సెక్యురిటీ విభాగానికి చెందిన ఇద్దరు సెక్యురిటీ గార్డులు తమకు కేటాయించిన విధులను పక్కన పెట్టి, మంత్రిగారి కొడుకును రక్షించేందుకు పరుగున రావడమే కాకుండా, ఇద్దరు పౌరులను నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే చితక బాదారు.

 

ఈ విధంగా ఒక మంత్రికి కేటాయించిన సెక్యురిటీ సిబ్బందిని సదరు మంత్రి కొడుకే దుర్వినియోగ పరచడం ఒక తప్పయితే, ఉగ్రవాదులు లేదా నక్సలయిట్ల నుండి మంత్రిని రక్షించడానికి మాత్రమే నిర్దేశించబడిన సెక్యురిటీ సిబ్బంది మంత్రి గారి కొడుకు కోసం ప్రజలను చితకబాదడం మరో పెద్ద తప్పు. అయినప్పటికీ, ఈ విషయంలో ఇంతవరకు చిరంజీవి కానీ, ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ గానీ, చివరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఎవరూ కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే తప్పుచేసిన వాడు అసమదీయుడు గనుక. ఈ విషయంలో పోలీసులు కూడా వారికి తగిన విధంగానే ప్రవర్తిస్తున్నారు.

 

ఇటీవల ముకేష్ అంభానీకి ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపై వివాదం చెలరేగినప్పుడు, సుప్రీంకోర్టు కలుగజేసుకొని వీ.ఐ.పీ. వ్యక్తులందరికీ ప్రజాధనంతో సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదులు లేదా నక్సలయిట్ల నుండి ఎటువంటి ముప్పు లేని వీ.ఐ.పీ. వ్యక్తులకు ఏర్పాటు చేసిన సెక్యురిటీ సిబ్బందిని వెంటనే ఉపసంహరించాలని కోరింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు చేత పదేపదే మొట్టికాయలు తినడానికి అలవాటుపడిపోయిన ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలో చిరంజీవికి ఏర్పాటు చేసిన సెక్యురిటీ సిబ్బంది, ఆయన మెప్పు పొందేందుకు తమ పరిదులు దాటి అతిగా ప్రవర్తించారు. ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి.