సామాన్యుడిపై మెగా ప్రతాపం

 

చట్టం దృష్టిలో కొందరు అధిక సమానులని మన దేశంలో ఇప్పటికి చాలాసార్లే రుజువయింది. తన కారుకి దారివ్వలేదని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై ఆగ్రహించిన మగధీరుడు రామ్ చరణ్ తేజ్, తన అంగరక్షకులను రప్పించి వారిని నడిరోడ్డు మీదే అందరు చూస్తుండగానే చితక బాధించాడు. అప్పుడు ఆ యువకులిద్దరూ అతనిపై పిర్యాదు చేద్దామని పోలీసు స్టేషన్ కి వెళ్ళినప్పటికీ, సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఏమి జరుగుతుందో గ్రహించిన వారు, అతనిపై పిర్యాదు చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో చాలా ముందుచూపు కనబరుస్తూ, వారిరువురికీ రామ్ చరణ్ పట్ల ఎటువంటి పిర్యాదులు లేవని ఒక లేఖ వ్రాయించుకొని వదిలిపెట్టారు.

 

దానిపై రామ్ చరణ్ స్పందిస్తూ, “ఆ యువకులు నా దృష్టిని ఆకర్షించాలనే ఆ విధంగా చేసినట్లు వారు ఒప్పుకొనారు. జరిగినదానికి వారు నాకు క్షమాపణలు కూడా చెప్పారు. పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని చాలా చక్కగా నిర్వహించారు” అని మీడియాతో అన్నారు.

 

అయితే, రామ్ చరణ్ అంగరక్షకుల చేతిలో దెబ్బలు తిన్న అడవి ఫణీష్ మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా ఇటువంటి కేసుల్లో చివరికి ఏమవుతుందో నాకు బాగా తెలుసు. నేనొక సామాన్య మద్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్న నాకు, డబ్బు, సమాజంలో పరపతి ఉన్న కేంద్రమంత్రి కొడుకయిన రాం చరణ్ తేజ్ వంటి వ్యక్తిని కోర్టుకు రప్పించి అతనికి శిక్షపడేలా చేయగల శక్తి, ఆర్ధిక స్తోమత నాకు లేదు. ఒకవేళ నేను అతనిపై కేసు వేసినా, నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ చివరికి నా ఉద్యోగం పోగొట్టుకోవడం తప్ప నాకు న్యాయం జరగదని తెలుసు. పైగా ఇటువంటి కేసులు ఏవిధంగా ముగుస్తాయో అందరికీ తెలిసిందే గనుక నేను కేసు వేయలేదు. నేను రాం చరణ్ తేజ్ కి క్షమాపణ చెప్పాననడం అబద్ధం. అతను నన్ను తన అంగరక్షకులతో చితక బాధించినందుకా నేను క్షమాపణ చెప్పాలి?” అంటూ పలికిన అతను సమాజంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టాడు. అతను చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజమని ఒప్పుకోక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.

 

అయితే, అతను ఈ పోరాటంలో ఓటమి అంగీకరించి తప్పుకొన్నపటికీ, చిరంజీవిని వ్యతిరేఖించే కొందరు రాజకీయ నేతలు రామ్ చరణ్ తేజ్ కి వ్యతిరేఖంగా కోర్టులో కేసు వేస్తే తాము అతనికి అండగా నిలబడతామని ముందుకు వచ్చినప్పటికీ, ఆ యువకుడు మరింత పరిణతి కనబరుస్తూ వారి రాజకీయ చదరంగంలో పావుగా మారదలుచుకోలేదని నిర్ద్వందంగా చెప్పడం మెచ్చుకోవలసిన విషయం.

 

ఫణీష్ ఎటువంటి పిర్యాదు చేయదలచుకోనప్పటికీ, అతనికి జరిగిన అన్యాయానికి స్పందించిన హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న సలీం అనే వ్యక్తి రామ్ చరణ్ తేజ్ మరియు అతని అంగరక్షకులపై మానవ హక్కుల సంఘంలో నిన్న పిర్యాదు చేసారు. ఆయన పిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల సంఘం చైర్మన్ హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ని వచ్చేనెల 8వ తేదీలోగా ఈ ఘటనపై నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. అయినప్పటికీ, అనేక ఇతర కేసులలో లాగానే ఇది కూడా కొన్ని రోజుల తరువాత బుట్ట దాఖలవుతుందని ఫణీష్ నమ్మకం వమ్ము కాదని చెప్పవచ్చును.

 

ఏది ఏమయినప్పటికీ, సినిమాలలో ఎంతో ఉద్దాతంగా కనిపించే హీరో రామ్ చరణ్ తేజ్, నిజ జీవితంలో మాత్రం విలన్ గా మిగిలిపోయాడు. కనీసం అతను ఇప్పటికయినా తన హీరో బేషజం పక్కన బెట్టి జరిగిన తప్పును నిజాయితీగా ఒప్పుకొని ఆ యువకులకు క్షమాపణలు చెపితే ఆయన ప్రతిష్టకు భంగం కాదు. పైగా పెరుగుతుంది కూడా. గతంలో డా. రాజశేఖర్ దంపతులపై తన అభిమానులు దాడి చేసినట్లు తెలియగానే చిరంజీవి స్వయంగా వారింటికి వెళ్లి క్షమాపణలు చెప్పడం గమనిస్తే రాం చరణ్ కి తాను ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం అవుతుంది.