రజనీకాంత్ వియ్యంకుడి అరెస్ట్‌కి వారెంట్!

 

ప్రముఖ తమిళ సినీ నటుడు రజనీకాంత్ వియ్యంకుడు (నటుడు ధనుష్ తండ్రి) కస్తూరిరాజాకు చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం నాడు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన 2012 సం.లో చెన్నైలో షావుకారు పేటకు చెందిన ముకున్‌ చంద్‌ బోద్రా అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 65 లక్షలు అప్పు తీసుకొన్నారు. అందుకోసం కస్తూరి రాజా ఆయనకి రెండు చెక్కులు ఇచ్చేరు. కానీ ఖాతాలో సరిపోయినంత బ్యాలన్స్ లేకపోవడం వలన అవి బౌన్స్ అయ్యాయి.

 

అప్పటి నుండి ముకున్‌ చంద్‌ బోద్రా అనేకమార్లు తన డబ్బును వాపసు చేయమని కస్తూరిరాజాను కోరుతున్నప్పటికీ ఏవో కారణాల చేత ఆయన ఇంతవరకు తిరిగి చెల్లించలేకపోయారు. దానితో ఆయనపై బోద్రా చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేయగా అది నిన్న విచారణకు వచ్చింది. కస్తూరిరాజా కానీ ఆయన తరపున లాయర్లు గానీ కోర్టుకు హాజరయ్యి సంజాయిషీ ఇవ్వకపోవడంతో కోర్టు ఆయన అరెస్టుకు వారెంట్ జారీ చేసింది.

 

ఈ మధ్యనే వన్ ఇండియా మీడియా సంస్థ తమ బాకీలు చెల్లించలేదంటూ రజనీకాంత్ ఆస్తులను స్వాధీనం చేసుకొంటామని ఒక బ్యాంక్ పత్రికలో నోటీసులు ఇచ్చింది. చాలా భారీ బడ్జెట్ తో నిర్మించిన కొచ్చాడియాన్ మరియు లింగా సినిమాలు రెండు కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఆయనపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది. పాపం రజనీకాంత్ కి కష్టాలన్నీ ఒక్కసారే చుట్టుముట్టినట్లున్నాయి.