బాహుబలి నిడివి మూడు గంటలు పైనేనట...అబ్బో!

 

దర్శకుడు రాజమౌళి ప్రతిభ మీద ఎంతో నమ్మకంతో ఆర్కమీడియా సంస్థ వారు దాదాపు రూ.150 కోట్లు పైగా ఖర్చు చేసి బాహుబలి సినిమాను తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి నిర్మిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రభాస్ అయితే అప్పటి నుండి మరొక సినిమా తీయకుండా బాహుబలికే పూర్తిగా అంకితమయిపోయారు. రాజమౌళి ప్రతిభపై అందరికీ అంత నమ్మకం మరి. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ సినిమాను చాలా అద్భుతంగా శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారు దర్శకుడు రాజమౌళి.

 

సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కానీ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉన్నట్లు తాజా సమాచారం. ఈరోజుల్లో అన్ని గంటల పాటు ప్రేక్షకులను ధియేటర్లలో కూర్చోబెట్టడం చాలా కష్టం అని సినీ పరిశ్రమ వారే అంగీకరిస్తున్నారు. కనుక దానిని రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందని సినీ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు గంటల కొన్ని నిమిషాల పాటు సా.....గే ఆ సినిమాని మరికొంత సా.....గ దీసి మూడున్నర గంటలు చేసి దానిని రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తుంటే, రాజమౌళి ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

 

సినిమా నిడివి పెరిగిపోయిందని దానిని రెండు భాగాలుగా విడుదల చేసేందుకే అనవసరంగా కధని సాగదీసినట్లయితే మొదటికే మోసం వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మొదటి భాగంపైనే ప్రేక్షకులు పెదవి విరిచినట్లయితే ఇక రెండవ భాగం విడుదల చేయవలసిన అవసరం కూడా ఉండదని ఎవరయినా చెప్పగలరు. అదీకాక రెండు భాగాలు చూస్తే తప్ప పూర్తి సినిమా చూసినట్లు ఉండదు కనుక ప్రేక్షకులు ఏవిధంగా స్పందిస్తారో కూడా ఎవరూ ఊహించలేరు. కనుక సినిమా నిడివి కొంత ఎక్కువే ఉన్నప్పటికీ మంచి కధనంతో, కేవలం హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కనిపించే భారీతనంతో ప్రేక్షకులను కట్టిపడేయవచ్చని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కనుక ఈ ఒకటా...రెండా? అనే ఈ ధర్మసందేహానికి దర్శక నిర్మాతలు ఒక సమాధానం కనుకొంటే గానీ బాహుబలి మన ముందుకు రాడేమో?