నిత్య కుంభకోణ వ్రతం ఆచరిస్తున్న కాంగ్రెస్ పార్టీ

 

మొగుడు కొట్టి నందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకే నేను బాధపడుతున్నానందిట వెనకటికి ఓ మహా ఇల్లాలు. కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది. న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ తయారుచేసిన రిపోర్టులో మార్పులు చేసినప్పుడు బాధపడలేదు. కానీ, ఆయనకి సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినప్పడు మాత్రం చాలా బాధపడింది. అది కూడా ఆయనకి చివాట్లు పెట్టినందుకు కాదు. అవి కర్ణాటక ఎన్నికలలో ప్రతిద్వనిస్తున్నాయనే బాధపడింది.

 

కాంగ్రెస్ పార్టీ ఉసురుపోసుకొని ఈ ప్రతిపక్షాలు ఏమి బావుకొంటాయో తెలియదు కానీ, (అ)న్యాయశాఖా మంత్రి రాజీనామా చేసితీరల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీని పాపం! కాకులు పొడిచినట్లు నిర్దయగా పొడుచుకు తింటున్నాయి. కానీ, మహామహా కుంభ కోణాలలో ఎంతో సహనంగా ప్రతిపక్షాల గోల భరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే సహనం ప్రదర్శించి తన ఔదార్యం చాటుకొంది.

 

రోజుకొక కొత్త కుంభకోణం అనే వ్రతం చేప్పటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి నిరాటంకంగా నాలుగేళ్ల వ్రతం పూర్తిచేసుకొంది. తమ పార్టీ చెప్పటిన బృహుత్ వ్రతానికి భంగం కలగకూడదనే మహదాశయంతో ఈ రోజు రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కూడా ఏదో ఉడతా భక్తిగా తన తరపున ఓ రెండుకోట్ల లంచం కేసును పార్టీకి నివేదించుకొన్నారు. అది తమ పార్టీ స్థాయికి తగదని తెలిసి బాధపడినప్పటికీ, ప్రస్తుతానికి కాంగ్రెస్ వ్రతభంగం కలగకూడదనే ఏకైక ఆలోచనతో ఓ మినీ కుంభకోణాన్ని పార్టీకి నివేదించుకొన్నారు.

 

ఈ రోజు వ్రతకధ: రైల్వేబోర్డులో సభ్యుడి చేరిన మహేష్ కుమార్ అనే పెద్దాయన, నాలుగు రాళ్ళూ వెనకేసుకొనే అవకాశం ఉన్న రైల్వే విద్యుత్ బోర్డులోకి సభ్యుడిగా మారాలనుకొన్నారు. అందుకు చండీఘడ్ లో అటువంటి వ్యవహారాలను అవలీలగా మూడోకంటికి తెలియకుండా చక్కబెట్టేయగల సమర్డుడయిన రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లీని కలిసి మాట్లాడుకొన్నారు. ఎవరయినా సాయం అడిగితే కాదనలేని బలహీనతగల సింగ్లీగారు కేవలం రెండంటే రెండే కోట్లు పుచ్చుకొని ఆయన బదిలీకి రంగం సిద్దం చేసారు.

 

స్విస్ బ్యాoకులో జమా చేసేంత పెద్ద మొత్తం కాదు గాబట్టి, మొదటి విడతగా రూ.90 లక్షలు, మిగిలినది పని పూర్తయిన తరువాత పూర్తిగా క్యాష్ రూపంలోనే స్వీకరించాలనుకొన్నారు. కానీ, అమ్మ అన్నం పెట్టదు. అడుక్కు తిననివ్వదు అన్నట్లు వారి వ్యవహారంలోఎవరో గిట్టని వాళ్ళు వేలుపెట్టి వారి మీదకు సీబీఐని ఉసిగొల్పారు. మహేష్ కుమార్ పంపిన రూ.90 లక్షలను మంజూనాద్ అనే ఒక వ్యక్తీ బన్సాల్ గారి మేనల్లుడి చేతిలో పెడుతుంటే సీబీఐ వాళ్ళు అచ్చం మన పాత సినిమాలలో క్లైమాక్స్ సీనులో పోలీసులు ప్రత్యక్షంయినట్లుగానే హట్టాత్తుగా వారి ముందు ప్రత్యక్షమయి ‘యువ్వార్ అండర్ అరెస్ట్’ అంటూ వారిని పట్టుకోవడంతో అంతవరకు మూడో కంటికి తెలియకుండా సాగుతున్న కధ కాస్తా న్యూస్ చానల్స్ హెడ్ లైన్స్ లోకి వచ్చిపడింది.

 

ఇంకేముంది, షరా మామూలే ఇంతవరకు అశ్వినీ కుమార్ కేసుని పట్టుకొని ఊగుతున్న టీవీ చానళ్ళవారు, ప్రతిపక్షాల వారు ఆయనని వదిలి పెట్టి బన్సాల్ ని పట్టుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోవడం మొదలుపెట్టారు. అశ్వినీ కుమార్ బ్రతికేనురా  జీవుడా! అని తేలికగా నిట్టూర్పు విడిస్తే, బన్సాల్ మంత్రిగారు హడావుడిగా వెళ్లి సోనియమ్మ కాళ్ళ మీద పడ్డారు. ఆమె ఆయనను వెంటబెట్టుకొని నిత్యం ఏదో కోరే ‘కోరు కమిటీ’ తో కలిసి గదిలోకి వెళ్లి కాసేపు తలుపులు మూసుకొని కొంచెం చాయ్ పానీ స్వీకరించి కబుర్లు చెప్పుకొన్నాక, (గంభీర వదనాలతో) ఎవరి మానాన్న వారు ఇళ్ళకి వెళ్ళిపోయారు.

 

అంతిమంగా కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ "మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతీ చిన్నదానికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేయడం ప్రతిపక్షాలకి ఒక పెద్ద జబ్బుగా మారిపోయింది,” అని ఈ రోజు వ్రతానికి మంగళ హారతి పాడేసారు.

 

తలుపులు నమిలేసే వాడికి అప్పడాలు తినడం ఒక లెక్కా అన్నట్లు లక్షల కోట్ల 2జీ స్కాములు, బొగ్గు స్కాములు, వందల కోట్ల యఫ్.డీ.ఐ ముడుపులు, అగస్టా హెలికాప్టర్ ముడుపులనే అవలీలగా ఉఫ్ మని ఊదిపారేసిన కాంగ్రెస్ పార్టీకి తన స్థాయికి ఎంత మాత్రం తగని ఇటువంటి చిన్నచిన్న లంచాలకు, స్కాములకు ప్రతిస్పందించవలసి రావడం నామోషీగానే ఉంది. కానీ తప్పడం లేదు.

 

సమయం కానీ సమయంలోఇటువంటి పిల్ల (స్కా)పాములు కూడా బయటపడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది తప్ప అవి చేసినందుకు బాధ పడటం లేదు.

 

అయినా, ఇంత పెద్ద దేశాన్నిఒంటి హస్తంతో పాలిస్తున్నతమ ప్రభుత్వంలోఆమాత్రం చిన్నచిన్న కుంభకోణాలు బయటపడటం పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేకపోయినా, ఒక బాధ్యతగల ప్రభుత్వంగా సంజాయిషీ ఇస్తున్నా కూడా ప్రతిపక్షాలు తమ ‘రాజీనామా డిమాండ్ జబ్బు’ ను వదులుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. అందుకే వారిని అదుపులో ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపు మరొక స్కాము వారి ముందు పడేస్తుంది. దానితో వారు కూడా పాత స్కామును వదిలి పెట్టి కొత్త స్కాముకి అలవాటుపడతారు.

ఈవిధంగా  మరొక ఆరేడు నెలలు వారిని ‘మేనేజ్’ చేయగలిగితే అప్పటికి ఎలాగు ఎన్నికలు వస్తాయి. ఇక అప్పుడు అందరికీ ఎన్నికలు, పార్టీ టికెట్స్ గొడవే తప్ప స్కాముల గురించి అడిగే తీరిక, శ్రద్ధా ఉండవని కాంగ్రెస్ ఆలోచన. అయితే ప్రతిపక్షాల వారు మాత్రం ‘వంద గొడ్లు తిన్న రాంబందు ఒక్క గాలివానతో చచ్చినట్లు’ లక్షల కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే ఎన్నికలలో కొట్టుకుపోతుందని పిల్లి శాపాలు పెడుతున్నాయి.