రాహుల్ గాంధీ కబుర్లు

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇంతకుముందు యూపీఏ అధికారంలో ఉన్నపుడు ఆయనను ఏదో ఒక కాలేజీవాళ్ళో, సంస్థలో ఆహ్వానిస్తే ఆయన రాజకీయాలలో నైతిక విలువలు, దేశాభివృద్ధి, మహిళా సాధికారికత, అవినీతి అరికట్టడం, యువత, నగదు బదిలీ పధకం దాని ప్రయోజనాలు వంటి అంశాలపై అనర్గళంగా ఉపన్యాసాలు దంచుతూ క్షణం తీరికలేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఉపన్యాసాలను వినేవారే కరువయ్యారు. అందుకని ఇప్పుడు మీడియా వాళ్ళను పిలిచి మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

 

ఇటీవల అమేథీ పర్యటించినపుడు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగిపోయాయని, కనుక బీజేపీకి ఓటేసి గెలిపిస్తే పెరుగుతున్న ధరలను అదుపు చేసి చూపిస్తామని నరేంద్ర మోడీ నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అందుకు ప్రధాని మోడీయే బాధ్యత వహించాలి. తక్షణమే ధరల అదుపుకు అవసరమయిన చర్యలు చెప్పట్టాలి,” అని డిమాండ్ చేసారు. రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రజా సమస్యలపై, ముఖ్యంగా పెరుగుతున్న ధరలపై మాట్లాడటం వినడానికి చాలా బాగుంది. కానీ యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఈ విషయంపై నోరెందుకు మెదపలేకపోయారో కాస్త వివరిస్తే బాగుండేది.

 

గత పదేళ్ళలో ఆయన ఏనాడు కూడా ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఎందువలన అంటే కేంద్రంలో రాష్ట్రంలో కూడా తమ పార్టీయే అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బెంచీలలోకి మారింది గనుక ఇప్పుడు దైర్యంగా ధరల పెరుగుదల గురించి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల ఎన్డీయే అధికారం చెప్పట్టక మునుపు నుండే మొదలయిందనే విషయాన్ని ఆయన ఇప్పుడు ప్రస్తావించడంలేదు.

 

రాహుల్ గాంధీ అడిగినా, అడగకపోయినా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేప్పట్టింది. అయితే వాటి ఫలితాలు కనబడటానికి మరోకొంత సమయం పట్టవచ్చునని మార్కెట్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ పనితీరును అంచనావేసేందుకు, ప్రభుత్వానికి మరికొంత సమయం ఈయవలసి ఉంటుందని అన్నారు. అటువంటప్పుడు యూపీయే ప్రభుత్వం పదేళ్ళ పాలనలో చేయలేని పనిని మోడీ ప్రభుత్వం కేవలం నెల పదిహేను రోజుల వ్యవధిలోనే చేయాలని రాహుల్ గాంధీ ఆశించడం చాలా హాస్యాస్పదం. కనుక రాహుల్ గాంధీ తనకు బాగా పట్టున్న మరేదయినా అంశం గురించి మాట్లాడితే బాగుంటుందేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu