అందుకే మహిళా ముఖ్యమంత్రి అని ప్రకటించారా?

 

తెలంగాణా ఏర్పడింది గనుక ఈ ఎన్నికలలో గెలిస్తే ముఖ్యమంత్రి అవుదామని తమలో తాము కుమ్ములాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలందరికీ రాహుల్ యువరాజావారు నిన్న పెద్ద షాక్ ఇచ్చారు. కేసీఆర్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో ‘తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మహిళని ముఖ్యమంత్రిగా చేస్తామని’ ప్రకటించేసి స్వంత పార్టీ నేతలను ఇరకాటంలో పడేసారు.

 

ముఖ్యమంత్రి పదవి కోసం జైపాల్ రెడ్డి తన కేంద్రమంత్రి పదవిని వదులుకొనేందుకు కూడా సిద్దపడిన సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా జానారెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు వంటి అనేకమంది సీనియర్లు ముఖ్యమంత్రి కుర్చీలో రుమాలు వేసి కుర్చీచుట్టూ చాలా కాలంగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ వారిని కాదని మహిళను ముఖ్యమంత్రిని చేస్తానని రాహుల్ గాంధీయే స్వయంగా ప్రకటించడంతో వారందరి ఆశల అడియాసలయ్యాయి. వారు కనుక ఇప్పుడు అలిగినట్లయితే, అది పార్టీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చును. తెరాసను దెబ్బ తీయాలని యువరాజావారు వేసిన ఎత్తుతో స్వంత పార్టీయే చిత్తయేలా ఉంది. ఒకవేళ టీ-కాంగ్రెస్ నేతలు తాత్కాలికంగా ఇప్పడు వెనక్కి తగ్గినా ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పరచగలిగితే, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ మొదటి రోజు నుండే ఆ మహిళా ముఖ్యమంత్రి కుర్చీ క్రింద మంట పెట్టడం ఖాయం.

 

తొలి ముఖ్యమంత్రి మహిళేనని యువరాజవారు ప్రకటించేశారు కనుక, ప్రస్తుతం ఆ రేసులో గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డీ.కే.అరుణ మాత్రమే ప్రధానంగా కనబడుతున్నారు. వారిలో గీతారెడ్డి ముందు స్థానంలో ఉన్నప్పటికీ, ఆమెను సీబీఐ భూతం వెన్నాడుతూనే ఉంది గనుక మిగిలిన ఇద్దరు లేదా కాంగ్రెస్ అధిష్టానం మదిలో మరో మూడో వ్యక్తి ఎవరో ఉండి ఉంటే ఆమె ముఖ్యమంత్రిగా నియమింపబడవచ్చును.

 

అయినా ఈరోజు తెలంగాణాలో పార్టీల పరిస్థితి చూసినట్లయితే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనబడటం లేదు. బహుశః అది గ్రహించే ఎలాగు తమ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే రాహుల్ గాంధీ, తెరాసను దెబ్బ తీస్తూనే మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఈవిధంగా ప్రకటించారేమో! ఒకవేళ ఎన్నికల తరువాత మళ్ళీ నిర్లజ్జగా తెరాసతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ముఖ్యమంత్రి కావాలని తపించిపోతున్న కేసీఆర్ ఒక కాంగ్రెస్ మహిళకి తన కూర్చోవాలనుకొంటున్న కుర్చీని అప్పగిస్తారని ఎవరూ అనుకోరు. పోనీ ఉపముఖ్యమంత్రి పదవైనా ఇస్తారా? అంటే దానిని ఆయన మైనార్టీలకు ఎప్పుడో వ్రాసి ఇచ్చేసానని చేపుతున్నారాయే. అంటే కాంగ్రెస్ స్పష్టమయిన మెజార్టీ సాధిస్తే తప్ప యువరాజవారి మాటకు విలువుండదని స్పష్టమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కి అంత సీను లేదు. అంటే...