రాహుల్ శల్య సారధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ పని సరి

 

అసలే రాష్ట్ర విభజనతో కుదేలయియిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు మూలిగే ముసలి నక్కపై తాటి పండుపడినట్లు నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్ రిటర్మెంట్ ప్రకటనతో మరో గడ్డు సమస్య ఎదురవనుంది. ఇంతవరకు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతోంది. ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాక సీమాంధ్ర కాంగ్రెస్ వ్యవహారాలలో కూడా ఆయన వ్రేలు పెడితే, ఇక తమ పని గోవిందా! అని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బయపడుతున్నారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ఉన్నవ్యతిరేఖత ఆయన రాకతో మరింత పెరిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పైగా రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు ఎన్నికల పొత్తులకి సిద్దమవుతున్నఈ సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీకి శల్యసారద్యం చేస్తే చేజేతులా ఉన్న కొద్దిపాటి అవకాశం కూడా చెడుతుంది.

 

మంచి పరిపాలనా దక్షులుగా పేరు పొందిన చంద్రబాబు, మోడీ ఒకపక్క, అనుభవరహితులయిన రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి మరోపక్క నిలబడితే ప్రజలు మోడీ-బాబు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సీమాంధ్రకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర విభజన ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమయింది. దానికి తోడు రాజకీయ అపరికత్వతతో రాహుల్ గాంధీ యువతకే పెద్దపీట, నీతి నిజాయితీ, పార్టీ ప్రక్షాళన అంటూ సీనియర్లను పక్కనబెట్టి కొత్తవారికి టికెట్స్ అంటే సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో సైతం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన నాటి నుండి ప్రజలు అతనిని మోడీతో బేరీజు వేసి చూడటం మొదలుపెడితే, రాహుల్ గాంధీకి తక్కువ మార్కులు పడతాయి గనుక, ఆయన సారధ్యంలో నడిచే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది.

 

ఇక, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి సంబందమూ లేదని రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీతో బాటు సోనియా, రాహుల్ గాంధీలను దుమ్మెత్తి పోస్తున్నన్నారు. కానీ ఇంతవరకు సోనియా, రాహుల్ గాంధీలు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి పల్లెత్తు మాట పలకకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్న సీమాంధ్ర ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అనుబంధం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టవచ్చును. ఇక రాష్ట్ర విభజనతో తెలంగాణా ఏర్పాటు చేసి లబ్ది పొందాలని భావిస్తున్నకాంగ్రెస్ పార్టీ, తెరాసతో పొత్తులు ఖరారు చేసుకోగానే, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ది కోసమే విభజన చేస్తున్నట్లు స్వయంగా ఖరారు చేసినట్లువుతుంది. అది కూడా సీమాంధ్రలో పార్టీపై తీవ్ర విపరీత ప్రభావం చూపవచ్చును. సీమాంధ్రలో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు రాహుల్ గాంధీకి తగిన సలహాలు ఇచ్చేనేతలు కూడా ప్రస్తుతం లేకపోవడం మరో పెద్ద సమస్య. రాజకీయ దురందరులనదగ్గ వారందరూ పార్టీకి దూరమయిపోయారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ వచ్చి శల్యసారధ్యం చేస్తే ఏమవుతుందో ఊహించవచ్చును.