యువరాజా వారికి చేతి నిండా పనే

 

త్వరలో పట్టాభిషేకం చేసుకోనున్న కాంగ్రెస్ యువరాజా వారు ముందుగా దేశం నుండి అవినీతిని పారద్రోలాలనుకొన్నారు. ఆ ప్రయత్నంలో నలుగురు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మరెందరో అధికారులు కలిసి చేసుకొన్నఆదర్శకుంభకోణాన్నిమళ్ళీ త్రవ్వి తీయాల్సిందేనని ఆజ్ఞాపించారు. అందుకు రాజమాత కూడా ఆమోదముద్ర వేసారు. కానీ ముప్పై అంతస్తుల ఎత్తున్న ఆ ఆదర్శ భవనానికి, అంతే లోతుగా వేసిన అవినీతి పునాదులు కదిపితే బిల్డింగు, దానితో బాటు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ భవనం కూడా బీటలు వారడం ఖాయమని భావించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీ రాజ్ చవానులవారు, మధ్యే మార్గంగా ఆ భవనంలో అంతగా రాజకీయ పలుకుబడి లేని ఓ 26మంది మీద మాత్రం కేసులు పెట్టగలమని, అంతకంటే లోతుగా త్రవ్వడం కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్కరం కాదని ఎలాగో యువరాజా వారికి సర్ది చెప్పారు.

 

ఆవిధంగా మహారాష్ట్రలో అవినీతిని తుడిచి పెట్టేయగానే, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సకుటుంబ సపరివారంగా విద్యుత్ కంపెనీల నుండి కోటానుకోట్లు పిండుకొంటున్నారని బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కాకితో కబురంపింది. మొదట అందుకు కాంగ్రెస్ ఒప్పుకోకపోయినా, బహుశః మళ్ళీ యువరాజవారు సైగ చేసారో ఏమో ఒక సీబీఐ ఎంక్వయిరీ వేసేసి చేతులు దులుపుకొంది. ఎలాగూ మరో నాలుగయిదు నెలలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి గనుక సీబీఐ దర్యాప్తు చేసినా అప్పుడే చూసుకోవచ్చునని అనుకొన్నారు.

 

కానీ, అదేమీ చిత్రమో! ఎన్ని కుంభకోణాలు కప్పెడుతున్నా శ్మశానంలో కంకాళాలాలాగ ఎక్కడో ఒక చోట కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని అగస్టా హెలికాఫ్టర్లో తిరిగితే మిగిలిన పరువేదయినా ఉంటె ఆ నరేంద్ర మోడీ దానిని కూడా తీసి పడేస్తాడని భయపడి, అగస్టా కుంభకోణాన్ని(కాంట్రాక్టు) కూడా రద్దుచేసి పడేసారు.

 

ఇంకా బొగ్గు కుంభకోణం, రైల్వే వాగన్ల కుంభకోణం, భూ కుంభకోణాలు వగైరాలు చాలా కుంభకోణాలు ఎన్నికల నాటికి మిగిలిపోయేలా ఉన్నాయి. అందువల్ల యువరాజవారు కొంచెం ఓవర్ టైం చేయాలేమో కూడా!