రాహుల్ భజన చేయోద్దంటే వినరూ...

 

పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతోగానీ పోవంటారు పెద్దలు. అదేవిధంగా అధిష్టానానికి భజన చేయడానికి అలవాటు పడిపోయిన కాంగ్రెస్ ప్రాణులు రాహుల్ గాంధీ ఎంత వద్దని మొట్టుకొంటున్నా ఆయన భజన చేయడం ఆపలేకపోతున్నారు. ఆయన పార్టీని, ఇంకా వీలయితే దేశాన్ని సమూలంగా మార్చిపారేద్దామని కలలుగంటుంటే, అది అంత వీజీ కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార వికేంద్రీకరణ జరిగి దేశంలో మారుమూలనున్న పార్టీ కార్యకర్తకి కూడా పార్టీలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తుంటే, ‘అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ రాహుల్ గాంధీ తప్ప మరెవరికీ అధికార పగ్గాలు చెప్పట్టే యోగ్యత, హక్కు లేవని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు దిగ్విజయ్ సింగు వంటి సీనియర్ నేతలు.

 

“రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి పదవి చేపట్టనని ఎవరితో ఎన్నడూ అనలేదు. ప్రధాని పదవి కంటే ప్రజా సంక్షేమానికే తానూ అధిక ప్రాదాన్యం ఇస్తానని ఆయన అంటే, మీడియా దానిని వక్రీకరించి “ఆయన ప్రధాని పదవి మీద ఆసక్తి లేదు, మన్మోహన్ సింగు తరువాత ఎవరు ప్రధాని బాధ్యతలు చేపడతారు?” అంటూ ఒక పెద్ద చర్చ కూడా మొదలుపెట్టేసింది. అయితే, వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభిస్తే, తప్పనిసరిగా ఆయనే ప్రధాని పదవి చెప్పట్టాలని నేను కోరుకొంటాను."

 

"అసలు పార్టీ అధ్యక్ష పదవిని , ప్రధాన మంత్రి పదవిని ఒకరే చేపట్టడం మంచిదని నా అభిప్రాయం. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంతవరకు ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్నడూ కల్పించుకోలేదు. అయినప్పటికీ యుపీయే-1&2 లలో రెండు అధికార కేంద్రాలు ఉండటం వలన ప్రజలలో, పార్టీలో, ప్రభుత్వంలో కూడా కొంత గందరగోళం ఏర్పడినట్లు నేను భావిస్తున్నాను. అందువల్ల పార్టీని, ప్రభుత్వాన్ని ఒకరే నడిపిచినట్లయితే ఆ బాధ్యతలు చెప్పటిన వ్యక్తికి రెంటి మీద పూర్తి ఆదిపత్యం కలిగి ఉండటమే కాకుండా, దానివల్ల ఆ రెండు వ్యవస్థల మధ్య చక్కటి సమన్వయం కూడా ఏర్పడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం,” అంటూ తన రాహుల్ గాంధీ భజన కార్యక్రమం ముగించారు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దిగ్విజయ్ సింగు.