మోడీపై రాహుల్ గాంధీ విమర్శలా?

 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే అనేక దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. ఇన్ని దశాబ్దాలలో ఏ దేశమయినా గణనీయమయిన అభివృద్ధి సాధించగలదు. కానీ దేశానికి అపారమయిన ఖనిజ సంపదలు, నీటి వనరులు, మానవ వనరులు, సువిశాలమయిన భూమి అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా దేశంలో కోట్లాది ప్రజలు నేటికీ పస్తులు ఉంటూనే ఉన్నారు...అన్నదాతలు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు...అందుబాటులో లేని విద్యా వైద్యం కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టుకొని సామాన్య ప్రజలు రోడ్ల మీద పడుతూనే ఉన్నారు. అలాగని ఈ ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో అభివృద్ధి జరగలేదని చెప్పలేము కానీ, అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి మాత్రం నామమాత్రమేనని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇన్ని దశాబ్దాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేయలేన్నప్పుడు, మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన ఏడాది కాలంలోనే ఎలా సాధ్యం?

 

ఎన్నికల సమయంలో తెలంగాణాలో పర్యటించిన రాహుల్ గాంధీ, ‘మేడ్ ఇన్ తెలంగాణా’ పేరుతో వస్తువులు ఉత్పత్తి చేయడమే తమ పార్టీ ద్యేయమని చెప్పుకొని జనాల చేత చప్పట్లు కొట్టించుకొన్నారు. కానీ గత పదేళ్లుగా సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే పరిపాలించినప్పుడు అప్పుడే ఆ పని చేసి ఉండవచ్చు కదా? కానీ అప్పుడు ఎందుకు చేయలేదు? పదేళ్ళలో చేయని పనిని ఎన్నికలలో గెలిస్తే చేస్తామని హామీ ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడం కాదా? తను ఆ నాడు ఎన్నికల సభలో చెప్పిన మాటనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో అమలుచేస్తుంటే, అందుకు ఆయనని అభినందించడానికి బదులు ఎందుకు విమర్శిస్తున్నారు?

 

ఇక తమ యూపీఏ ప్రభుత్వం రైతుల హక్కులను, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తెచ్చిన భూసేకరణ బిల్లును మోడీ ప్రభుత్వం కొంతమంది బడా పారిశ్రామిక వేత్తల కోసం సవరణలు చేసి రైతులకు అన్యాయం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పాలనలోనే దేశంలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొన్నారు? పోనీ యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంతోనే రైతుల సమస్యలన్నీ తీరిపోతాయా? అంటే తీరవని అందరికీ తెలుసు.

 

రాహుల్ గాంధీ నిజంగానే రైతుల సంక్షేమం కోరుకొని ఉంటే వారు ఎల్లకాలం సుఖంగా వ్యవసాయం చేసుకొనేందుకు తోడ్పడే చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ మున్ముందు రైతులు భూములు అమ్ముకొంటే దాని వలన వారికి లాభం రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ భూసేకరణ బిల్లుని తీసుకు వచ్చినట్లు ఆయనే నిన్న స్వయంగా చెప్పుకొన్నారు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులు తమ భూములు అమ్ముకోవాలని రాహుల్ గాంధీ ఎందుకు అనుకొంటున్నారు? రైతులు విరివిగా పంటలు పండించి లాభాలు కళ్ళ జూసేందుకు రైతులకు తోడ్పడే చట్టాలను ఏమయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ఉండి ఉంటే దాని గురించి ఎంతయినా చెప్పుకోవచ్చును. కానీ భూసేకరణ చట్టం గురించి మాట్లాడటం దేనికంటే మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే తప్ప నిజంగా రైతుల మీద ఉన్న ప్రేమతో మాత్రం కాదనే చెప్పవచ్చును.

 

రాహుల్ గాంధీకి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే శక్తే ఉన్నట్లయితే, ఆపని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చేసి చూపిస్తే అందరూ హర్షించేవారు. కానీ ఆయనకు కనీసం తన కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి, అర్హత రెండూ లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయన నాయకత్వ లక్షణాలు, పటిమ గురించి ప్రశ్నిస్తున్నారనే కోపంతోనే ఆయన రెండు నెలలు శలవు అంటూ విదేశాలలో తిరిగి వచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు గట్టిగా కృషి చేస్తున్న ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వ పనితీరును ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఆయనను విమర్శించడం ద్వారా తను ఆయనకి ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకోవడానికే అనుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని, దాని పద్దతులను అన్నిటినీ సమూలంగా ప్రక్షాన చేసేయలనుకొంటున్న రాహుల్ గాంధీ తను మాత్రం ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీ మూస పద్దతుల నుండి బయటపడలేక పోతున్నారు.