Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హస్తినలో పీవీ కాంస్య విగ్రహం
posted on: May 12, 2025 2:44PM

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు.. అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహరావు కాంస్య విగ్రహం త్వరలో హస్తినలో ఏర్పాటు కానుంది. జీవిత కాలం కాంగ్రస్ తోనే పయనించి, ఈ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఎదిగి.. దేశానికి ఎనలేని సేవలందించిన పీవీ నరసింహరావుకు ఎట్టకేలకు దేశ రాజధాని హస్తినలో ఒకింత చోటు, గుర్తింపు లభించనుంది.
దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఈ మహా మేధావి.. కాంగ్రెస్ పార్టీకే ప్రత్యేకమైన రాజకీయాలు, అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీలో కనీస గౌరవానికి కూడా నోచుకోలేదు. చివరాఖరికి ఆయన మరణించినప్పుడు, ఆయన పార్ధివ దేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదు. చివరికి హస్తినలో అంత్యక్రియలు కూడా జగరలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ కు ఆయన పార్ధివదేహాన్ని తరలించి.. అక్కడ అంత్యక్రియలు జరిపించారు. ఇందుకు ఆయన విధానాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా విభేదించడమే కారణం. అంతెందుకు ప్రధానిగా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన ఆయనకు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇన్నేళ్లకు హస్తినలోని బీజేపీ ప్రభుత్వం ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. పీవీ విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో అతి త్వరలోనే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకొంచం వెనక్కు వెడితే.. గత ఏడాది ఏప్రిల్ లో పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ పీవీ విగ్రహాన్ని హస్తినలోని ఆంధ్రా భవన్ లేదా తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కు లేఖ రాసింది. ఈ లేఖపై ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఈ ఏడాది మార్చి 27న జరిగిన సమావేశంలో చర్చించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కు పంపింది. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో త్వరలో పీవీ కాంస్య విగ్రహం హస్తినలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్నది. .






