పట్టుదల వీడని, వెనుకడుగు వేయని సింధు

 

పీవీ సింధు అంటే పూసర్ల వెంకట సింధు కాదు.. పట్టుదల వీడని, వెనుకడుగు వేయని సింధు అని రుజువు చేసింది. బ్యాడ్మింటన్‌లో మరే భారత క్రీడాకారులకు సాధ్యంకాని.. ఎవరూ అందుకోలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించి.. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

పీవీ సింధు ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో.. అప్పటివరకు సాధారణంగా వినిపించిన సింధు పేరు దేశమంతా పెద్ద సంబరంలా వినిపించింది. సింధు గెలిచింది రజతమే అయినా.. ఒలింపిక్స్‌లో మువ్వెన్నెల జెండా మురిసిపోయేలా చేయడంతో.. దేశమంతా స్వర్ణాన్ని మించిన సంబరాలు జరిగాయి. తనను వరించిన రజత పతకం, ప్రశంసల వర్షంతో సింధు కొందరిలాగా విర్రవీగలేదు, విశ్రమించలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి దేశం గర్వపడేలా చేయాలన్న తన లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కొన్నేళ్లుగా విరామం లేకుండా పోరాడింది. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో..  2013, 2014 లలో కాంస్యంతో సరిపెట్టుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో సింధు మీద అంచనాలు పెరిగాయి. విపరీతమైన ఒత్తిడి. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కి చేరింది. కానీ రజతంతోనే సరిపెట్టుకుంది. అయినా తాను నిరాశ చెందలేదు, పోరాటాన్ని ఆపలేదు. 2018 లో కూడా ఫైనల్ కి చేరింది కానీ మళ్లీ రజతంతోనే సరిపెట్టుకుంది. దీంతో కొందరు సింధు మీద విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ సింధు ఆ విమర్శలకు విజయంతోనే సమాధానం చెప్పాలనుకుంది. వరుసగా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. గత ఫైనల్ అవమానాలు వెక్కిరిస్తున్నాయి, విమర్శలు ఎదురవుతున్నాయి. కానీ అంత ఒత్తిడిలో కూడా చరిత్ర సృష్టించింది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాన్ని గెలిచి.. 2019 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. మళ్లీ దేశవ్యాప్తంగా సింధు మీద ప్రశంసలు మొదలయ్యాయి. కానీ, ప్రశంసలకు పొంగిపోని, విమర్శలకు కృంగిపోని నైజం మన తెలుగు తేజం సింధుది. గెలిచినా తన పోరాటం ఆపదు, ఓడినా తన పోరాటం ఆపదు. అందుకే సింధు ఎందరికో స్ఫూర్తి.