ప్రధానిని అడ్డుకున్న రైతులు.. సభ రద్దు చేసుకుని మోడీ రిటర్న్ 

posted on: Jan 5, 2022 3:56PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంజాబ్‌లో  షాక్ తగిలింది. కనీవినీ ఎరుగని భద్రత ఉండే ప్రధాని కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకున్నారు, దీంతో  తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని తిరిగి వెళ్లిపోయారు ప్రధాని మోడీ. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 

ఢిల్లీ-అమృత్‌సర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ వే, కపుర్తలా, హోశియార్‌పుర్‌లలో వైద్య కళాశాల సహా మొత్తం రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన కోసం దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వచ్చారు. భటిండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు హుస్సేనివాలకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫ్లైఓవర్ వరకు ప్రధాని కాన్వాయ్ చేరుకుంది. అయితే మోడీ  కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మోడీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే కాన్వాయ్ ని ఆపేశారు. దీంతో ఫ్లైఓవర్ పై మోడీ నిలిచిపోయారు. 

పాక్ సరిహద్దు జిల్లాకు ప్రధాని రావడంతో ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌, పంజాబ్‌ పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు. డ్రోన్లను కూల్చివేసే బృందాన్ని సైతం సన్నద్ధంగా ఉంచారు. అయితే, కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ చట్టం చేయాలని, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తూ ప్రధాని పర్యటనను వ్యతిరేకించాయి. ఏకంగా కాన్వాయ్ ను అడ్డుకున్నాయి. భద్రతా లోపాల వల్ల ప్రధాని సభ రద్దయినట్టు బీజేపీ ప్రకటించింది. ఈ విషయమై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ చన్నీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించింది.  

భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ వైఫల్యంపై తక్షణమే నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది ప్రధాని భద్రతకు సంబంధించి అతిపెద్ద వైఫల్యమని కేంద్ర హోంశాఖ వ్యాఖ్యానించింది.వాతావరణం సరిగా లేని కారణం వల్ల జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లే ప్రయాణానికి సంబంధించిన ప్లాన్ లో మార్పులు చేశామని... రోడ్డు మార్గం గుండా అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ మారిందని... అది 2 గంటల రోడ్డు ప్రయాణమని కేంద్ర హోంశాఖ తెలిపింది. భద్రతా ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయంటూ పంజాబ్ డీజీపీ నుంచి కర్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయల్దేరిందని చెప్పింది. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణిస్తున్నారని తెలిసినా పంజాబ్ ప్రభుత్వం అదనపు సెక్యూరిటీ ఏర్పాట్లను చేయలేదని తెలిపింది. 

ప్రయాణానికి విఘాతం కలిగిన నేపథ్యంలో మోడీ  కాన్వాయ్ భటిండా ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చిందని వెల్లడించింది. ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని... పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పింది. తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపింది. మరోవైపు ఫిరోజ్ పూర్ లో జరగాల్సిన ప్రధాని ర్యాలీ కూడా రద్దయింది. వాతావరణ కారణాల వల్ల ర్యాలీ రద్దయినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...