పంజాబ్ లో ముగిసిన ఆర్మీ ఆపరేషన్, ముగ్గురు తీవ్ర వాదులు హతం

 

పంజాబ్ రాష్ట్రంలో గురుదాస్ పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఈరోజు (సోమవారం) ఉదయం ఉగ్రవాదులు చేసిన దాడిలో మొత్తం ఎనిమిదిమంది చనిపోగా మరొక 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కనుక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఉదయం సుమారు 8గంటల భద్రతా దళాలు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న భవనంలో నక్కిన ఉగ్రవాదులను చుట్టుముట్టారు. అప్పటి నుండి సాయంత్రం వరకు వారి మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటల సమయానికి భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపడంతో మిలటరీ ఆపరేషన్ ముగిసింది.

 

మరణించిన ఉగ్రవాదులు బహుశః పాకిస్తాన్ కి చెందిన లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారివద్ద అత్యాధునిక ఆయుధాలతో బాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం కూడా ఉండటం అందరినీ విష్మయానికి గురి చేసింది. అంటే దీనికి చాలా ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక ప్రకారమే వారు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈ దాడిలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బల్జీత్ సింగ్ (డిటెక్టివ్) కూడా మరణించారు. కొన్ని రోజుల క్రితమే భారత్, పాక్ ప్రధాన మంత్రులు రష్యాలో సమావేశామయినప్పుడు ఇరు దేశాల మధ్య మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకోవాలని నిశ్చయించుకొన్నారు. కానీ సరిగా నెల తిరక్కుండానే పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడికి తెగబడటంతో పాకిస్తాన్ వైఖరి ఇక ఎన్నటికీ మారదని స్పష్టమయింది.