సమైక్యవాదమంటే ప్రేమోన్మాది చేసే యాసిడ్ దాడి వంటిదే

 

టీ.జేయేసీ చైర్మన్ ప్రొఫెస్సర్ కోదండరామ్ తెలంగాణావాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు సీమంధ్రలో జరుగుతున్న సమైక్యఉద్యమం ప్రేమోన్మాది చేతిలో యాసిడ్ వంటిదని అన్నారు. సమైక్యవాదులు ఇతరుల హక్కులను, స్వేచ్చను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణకు అడ్డుపడితే ఊరుకొబోమని, తెలంగాణా సత్తా ఏమిటో చాటి చెపుతామని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7న సిటీ కాలేజ్ నుంచి ఇందిరాపార్కు వరకు జరిగే తెలంగాణ సాధన ర్యాలీలో తెలంగాణా ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలను అడ్డుకొనేందుకు మళ్ళీ ప్రజలందరూ ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉందని అన్నారు. అందుకే సెప్టెంబర్ 1నుండి 6వరకు వరుసగా గ్రేటర్ హైదరాబాద్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్ లలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు నిర్విహించబోతున్నామని వాటిలో ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

విద్యార్ధుల జీవితాలు తీర్చిదిద్దవలసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఆపని చేయక చాల కాలమే అయ్యింది. మంచి వక్తగా పేరున్నఆయన ప్రతిభను కేసీఆర్ గుర్తించి తెలంగాణా ఉద్యమంలోకి ఆహ్వానించడంతో ఆయన దశ తిరిగింది. ఆయన తన జీవితమంతా ఆచార్యుడిగా పనిచేసినా రాని పేరు ప్రతిష్టలు, గుర్తింపు, రాజకీయంగా ఎదిగే అవకాశం అన్నీకూడా కేసీఆర్ మరియు తెలంగాణా ఉద్యమాల పుణ్యామని సంపాదించుకొన్నారు. టీ.జేయేసీ చైర్మన్ గా ఆయన కేసీఆర్ తో సమాన హోదా, పేరు ప్రతిష్టలు, సంపాదించుకొన్నతరువాత, ఆయన ఇప్పుడు కేసీఆర్ కే సవాలుగా మారారు. కేసీఆర్ చేపడుతున్న ఉద్యమాలకి సమాంతరంగా తాను ఉద్యమాలు నడుపుతూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారు.

 

వచ్చేనెల 7వ తేదీన ఆంధ్ర యన్.జీ.ఓ.లు హైదరాబాదులో లక్షమంది ఉద్యోగులతో తలపెట్టిన బహిరంగసభను అడ్డుకొనేందుకు కేసీఆర్ 6వ తేదీన రెండు లక్షల మందితో హైదరాబాదులో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిస్తే, ప్రొఫెసర్ కోదండరామ్ సెప్టెంబర్ 7న శాంతి ర్యాలీ జరపాలని పిలుపునీయడం, కేవలం తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.

 

తెలంగాణా కోసం పోరాడుతున్న కేసీఆర్ తో, తెరాసతో ఆయన కలిసి పనిచేయలేన్నపుడు, తెలంగాణావాదులందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునీయడం హాస్యాస్పదం. లక్షలాది ప్రజలను రోడ్లపైకి రప్పించి సాటి తెలుగు ప్రజలతోనే యుద్దానికి పురిగొల్పడం వలన ఎటువంటి దారుణ పరిణామాలు ఎదురవుతాయో తెలిసి కూడా ఈవిధంగా రెచ్చగొట్టడం ఆయన వంటి ఉన్నత విద్యావంతుడు చేయవలసిన పని కాదు.

 

రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ఆంధ్ర యన్.జీ.ఓ.లు కూడా ఇటువంటి ప్రమాదకరమయిన ఆలోచనలు మానుకోవాలి. ఉన్నత విద్యావంతులయిన ఇరుపక్షాల నేతలు కూడా ఇప్పుడు తమ ఆశయసాధనకు విజ్ఞతకు బదులు మంద బలం ఉపయోగించాలనుకోవడం చాలా అవివేకం. తమ ఆశయ సాధన కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం చాల హేయమయిన ఆలోచన. ఇటువంటి ఆలోచనలను ఎవరు చేసినా ఖండించాల్సిందే.