జపాన్‌కి చేరుకున్న మోడీ

 

భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్‌లోని క్యోటో నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన పలువురు అధికారులు, ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ వంటి పారిశ్రామికవేత్తలతో కలసి ఆయన జపాన్‌కి చేరుకున్నారు. క్యోటో విమానాశ్రయంలో జపాన్ ప్రధానమంత్రి సింజూ- మోడీ బృందానికి స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ని కూడా కాదనుకుని సింజూ విమానాశ్రయానికి వచ్చి మరీ మోడీ బృందానికి స్వాగతం పలకడం విశేషం. మోడీ ఈ పర్యటన సందర్భంగా మొదట స్మార్ట్ సిటీ అయిన క్యోటోలో పర్యటిస్తారు. భారతదేశంలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తున్న మోడీ దానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన పొందడం కోసమే క్యోటోలో పర్యటిస్తారు. జపాన్ పర్యటన సందర్భంగా మోడీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళతారనే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పర్యటనలో రక్షణ, పౌర అణు కార్యక్రమం, మౌలిక వసతులు అభివృద్ధి వంటి రంగాల్లో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ, పౌర అణు కార్యక్రమాల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.