నెలాఖ‌రికి కేసులు పీక్స్‌.. వైద్య‌సిబ్బందికి సెల‌వులు ర‌ద్దు.. బీఅల‌ర్ట్‌

posted on: Jan 6, 2022 1:48PM

వ‌చ్చే నాలుగు వారాలు కీల‌క‌మంటున్నారు డీహెచ్ శ్రీనివాస‌రావు. జ‌న‌వ‌రి చివ‌రి నాటికి పీక్ స్థాయికి చేరుకుంటుందని.. ఇప్ప‌టికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశామని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ఓవైపు రోజుకు వెయ్యికి పైగా కేసులు వ‌స్తుండ‌టం.. మ‌రోవైపు మెడిక‌ల్ స్టాఫ్‌కు సెల‌వులు ర‌ద్దు చేయ‌డం చూస్తుంటే.. థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తోంద‌ని అంటున్నారు. ముందు ముందు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంద‌ని.. కేసుల సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని చెబుతున్నారు. అయినా, భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని.. సెకండ్ వేవ్ మాదిరి హాస్పిట‌ల్స్ నిండిపోవ‌డం.. ప్రాణాలు పోవ‌డంలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు రావ‌ని అంటున్నారు. ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలంగాణ‌ డీహెచ్ శ్రీనివాస‌రావు తెలిపారు. 

"ప్రజలంతా తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. టీకా తీసుకోనివారు వెంటనే తీసుకోవాలి. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి. 2 కోట్ల కొవిడ్‌ పరీక్షలు, కోటికి పైగా హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉంచాం. ర్యాపిడ్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కూడా చేస్తున్నాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం." అని డీహెచ్ చెప్పారు. ఆయ‌న చెప్పిన లెక్క‌లు వింటుంటే.. అబ్బో ముందుముందు మ‌హ‌మ్మారి భారీగా విరుచుకుప‌డ‌టం ఖాయం అనిపిస్తోంది.

"తెలంగాణలో జనవరి ఒకటో తేదీ నుంచి కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీలోనూ ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో నాలుగు రెట్లకు పైగా కేసుల పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు కూడా 3శాతానికి పైగా ఉంది. కేసులు వేలాదిగా నమోదవుతున్నా తీవ్ర ప్రభావం లేదు. ఆస్పత్రుల్లో ఎక్కడా ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదు. కొత్త వేరియంట్ బారిన పడిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారు. జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి" అని డీహెచ్ శ్రీనివాస‌రావు తెలిపారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...