ఎన్నికలా... సినిమాలా... ప్రజల దారేది?

 

ఎన్నికలా...!? సినిమాలా...!? శుక్రవారం ప్రజల దారెటు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఓ వైపు.. కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీలతో కూడిన ప్రజా ఫ్రంట్ మరోవైపు... హోరాహోరీగా తలపడటంతో ఈ ఎన్నికలపై ఆంధ్ర ప్రజలతో పాటు దేశంలో పలు ప్రాంతాల ప్రజల ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పేపర్, టీవీ, వెబ్, యూట్యూబ్...  ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే. చివరికి సోషల్ మీడియాలోనూ ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల రోజు విడుదలవుతున్న సినిమాలను ఎంతమంది ప్ర్రేక్షకులు చూస్తారనేది చర్చనీయాంశం అయ్యింది.

సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం', బెల్లకొండ సాయి శ్రీనివాస్ 'కవచం', తమన్నా 'నెక్స్ట్ ఏంటి?' సినిమాలతో పాటు దాదాపుగా కొత్తవాళ్లు నటించిన 'శుభలేఖ+లు' కూడా రేపే విడుదలవుతున్నాయి. తెలంగాణలో రేపే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా ఓటు వేయడానికి క్యూ లైన్లు కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి సినిమా తొలిరోజు వసూళ్లపై ఎన్నికలు ప్రభావం చూపుతాయనేది విశ్లేషకుల అంచనా. ఓటు వేసిన తరవాత సినిమా థియేటర్లకు ప్రజలు వచ్చే అవకాశం వుంది. అలాగే, ఎగ్జిట్ పోల్స్ చూస్తూ టీవీల ముందు తిష్ట వేసే ప్రమాదమూ వుంది. ఎన్నికల హడావుడి ముగిసిన తరవాత టాక్ గమనించి సినిమాలకు వెళతారు. ఈ ఎన్నికలు కొత్త సినిమాలపై ఎంత ప్రభావం చూపుతాయనేది తెలియాలంటే కొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే. ఏం జరుగుతుందో?