ఉగ్రవాదుల కంటే కరుడుగట్టిన రాజకీయ నేతలు

Publish Date:Jul 9, 2013

 

నరేంద్ర మోడీనీ సాకుగా చూపి, బీజేపీ నేతృత్వం వహిస్తున్నఎన్డీయే కూటమి నుండి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు) తప్పుకొన్న తరువాత, ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నానాటికి తీవ్రతరమవుతోంది. ఇక, జేడీ(యు)ని ఎలాగయినా తన కూటమిలోకి ఆకర్షించాలనే తాపత్రయంతో కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ కి అండగా నిలబడుతూ తమ ఉమ్మడి శత్రువయిన బీజేపీపై విరుచుకు పడుతోంది.

 

మొన్న ఆదివారం నాడు బీహార్ రాష్ట్రం భోదగయ భౌద్ద క్షేత్రంలో జరిగిన ప్రేలుళ్ళను అవకాశంగా తీసుకొని బీజేపీ, జేడీ(యు)పై మాటలు రువ్వుతుంటే, అందులో కాంగ్రెస్ కూడా ప్రవేశించి బీజేపీపై ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్, జేడీ(యు)లు రెండు తీవ్రవాదుల దాడి గురించి ముందే సమాచారం ఉన్నపటికీ అలసత్వం చూపాయని బీజేపీ విమర్శిస్తే, బీజేపీ ఉగ్రవాదచర్యలను కూడా రాజకీయం చేస్తోందని నితీష్ కుమార్ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి బుద్ధి చెప్పమని బీజేపీ కార్యకర్తలకు పిలుపునీయడం, ఆ తరువాత ఆయన అనుచరుడు అమిత్ షా కూడా నితీష్ కి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేయడం, వెన్వెంటనే గయలో బాంబు ప్రేలుళ్ళు జరగడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, దిగ్విజయ్ సింగ్ ఇందులో బీజేపీ హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసారు.

 

బౌద్ధ ఆలయంలో బాంబు ప్రేలుళ్ళు జరిగిన తరువాత ఏఉగ్రవాద సంస్థ దానికి తామే బాధ్యులమని ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా అవి ఎవరి పనో ఇంతవరకు నిర్దారించలేదు. కానీ, దాడి జరిగిన వెంటనే హోం మంత్రిత్వ శాఖ ‘అది ఇండియన్ ముజాహుదీన్ పనే అయి ఉంటుందని’ క్షణంలో తేల్చిపడేసింది. ఇప్పుడు బాధ్యతగల పదవులను నిర్వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ అది బీజేపీ పనేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అది ముస్లిం తీవ్ర వాదులచర్య అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈవిధంగా దేశభద్రతకు సంబందించిన విషయాన్నీ కూడా అన్ని పార్టీలు రాజకీయం చేస్తూ ఉగ్రవాదులు నిశ్చింతగా మరిన్ని దాడులు చేసేందుకు అవకాశం ఇస్తున్నాయి.

 

దేశంలో ఇటువంటి బలహీనమయిన, ఐకమత్యంలేని రాజకీయ వ్యవస్థ ఉన్నపుడు, దేశ భద్రత విషయంలో కూడా అవి రాజకీయాలు చేస్తాయని తెలిసినప్పుడు, దర్యాప్తు సంస్థలపై అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉంటాయని తెలిసినప్పుడు, మన దేశం ఉగ్రవాదులకు లోకువగానే కనిపించడంలో ఆశ్చర్యం ఏమి లేదు. దేశ భద్రత, జాతీయ భావం కంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలు, నేతల ధోరణి మారనంత కాలం ఉగ్రవాదులు ఈవిధంగా చెలరేగిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంటారు.