రాజకీయ నేతల వితండవాదనలు

 

ప్రస్తుతం రాజకీయాలలో తర్కం కంటే వితండవాదనకే ఎక్కువ బలం ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నేతలు, పార్టీలు తమ తప్పులను నిజాయితీగా ఒప్పుకొనే రోజులు ఎప్పుడో పోయాయి. ఎన్ని తప్పులు చేసినా నిర్భీతిగా, నిర్లజ్జగా వితండవాదం చేస్తూ, తమను విమర్శించే వారిని తమ వాక్చాతుర్యంతో, అధికార బలంతో, ఇంకా అవసరమయితే మందబలంతో ఎదుటివాళ్ళ నోళ్ళు మూయించే నైపుణ్యం మన రాజకీయ నేతలు సంపాదించారిప్పుడు.


అక్రమాస్తుల కేసుల్లో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డి అవినీతి గురించి మీడియా మొత్తం సవివరంగా సాక్ష్యాలతో సహా చూపిస్తున్నపటికీ, క్రింద కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు అతనికి బెయిలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నపటికీ, అతనికి ఏ పాపం తెలియదని, అన్యాయంగా జైలులో పెట్టారని షర్మిల ఊరూరు తిరుగుతూ ప్రచారం చేయడం అందుకు ఒక ఉదాహరణ.


అవినీతికి పాల్పడినందుకు సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినప్పటికీ తమకే పాపం తెలియదని, తాము నిష్కళంక చరితులమని మన కాంగ్రెస్ మంత్రులే గాక ప్రభుత్వం కూడా వాదించడం ఇందుకు మరో ఉదాహరణ.


అడ్డుగోలుగా కరెంటు చార్జీలు పెంచినప్పటికీ, ప్రజల మీద ఒక్క పైసా కూడా అదనపు భారంపడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మైకులు బ్రద్దలయెంతగా నొక్కినొక్కి చెప్పడం ఇందుకు మరో గొప్ప ఉదాహరణ.


తెలంగాణ సాదించడంకోసమే ఉద్యమం పక్కన బెట్టి ఎన్నికలలో పాల్గొంటున్నామని తెరాస చెప్పడం, కనబడని ఆ ఉద్యమం బలోపేతం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలోజేరి టికెట్ తీసుకొంటున్నామని కాంగ్రెస్ యంపీలు చెప్పడం మరో రకమయిన వితండ వాదన. తమ పార్టీలో పోటీ చేయడానికి సరయిన అభ్యర్ధులు లేక ఇతర పార్టీల యంపీలకు, శాసన సభ్యులకు ఒకవైపు గాలం వేస్తూనే, కేవలం తెలంగాణ ఉద్యమంపట్ల నిబద్దత గలవారినే ఆహ్వానిస్తున్నామని ధర్మపన్నాలు వల్లే వేస్తున్న తెరాస నేతలది వితండవాదానకాక మరేమిటి?


పార్టీలోఎన్నిలుకలుకలున్నా, ఎంతమంది బయటకి వెళ్ళిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ‘మాపార్టీకేమి నష్టం లేదని’ వాదించే తెదేపా చేస్తున్న వితండ వాదన వలన ప్రజలెవరికీ నష్టం లేదు కనుక ఎంతయినా చేసుకోవచ్చును.


నోరు విప్పితే మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులు మాట్లాడవలసినదంతా మాట్లాడేసి, ఆనక పోలీసులు అరెస్ట్ చేస్తే, తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని జైళ్ళలో పెడుతోందని చేసే వితండవాదం షరా మామూలే. హిందూ మతంపై, హిందువులపై పూర్తి పేటెంట్ హక్కులు తనకే ఉన్నాయనుకొనే బాజపా తానే అసలు సిసలయిన సెక్యులర్ పార్టీయని వాదించడం ఈ కోవలోకే వస్తుంది. ఇలా చెప్పుకొంటే పోతే ఇదే ఒక వితండ గ్రంధం అవుతుంది.