భోగీ మంటలు రాజేస్తున్న రాజకీయ నేతలు

 

ఇక నేడోరేపో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్నిప్రకటించే సమయం ఆసన్నం అవుతున్నకొద్దీ, రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణా రాజకీయాలు ఊపందుకొంటున్నాయి. రెండు వర్గాలు కూడా దేనికవే తమకు స్పష్టమయిన సంకేతాలు అందుతున్నట్లు నమ్మకంగా ప్రచారం చేసుకొంటున్నాయి. అంతటితో ఆగితే పరువాలేదు, గానీ ఆ రెండు వర్గాలు కేంద్రం మీద తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనే విధంగా ఒత్తిడి తచ్చే ప్రయత్నంలో రకరకాల ప్రణాలికలు, సభలు ప్రకటిస్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర ప్రజలను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నాయి.

 

తెలంగాణా, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ప్రజలో లేక వారి వెనుకనున్న జేయేసిలో ఆపని చేస్తే అది సహజమేననుకోవచ్చును. గానీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న బాధ్యాతాయుతమయిన మంత్రి పదవులలో ఉన్నవారు, శాసన సభ్యులే స్వయంగా ప్రజలను, అవతలి వర్గం వారినీ కూడా రెచ్చగొట్టే తీరున మాట్లాడుతూ, సమావేశాలు నిర్వహించడం విచారకరం. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదిలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టంగా తెలియజేసిన తరువాత కూడా, ఆ పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు కూడా ఈ విదంగా ప్రవర్తించడం చాలా విచారకరం. అటువంటివారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గానీ ఏమి అనలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.

 

ఇక, కేంద్రం ఏ నిర్ణయం ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో రాజకీయ విస్పోటనం తప్పక పోవచ్చును. తెలంగాణా ప్రకటించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామంటున్న తెలంగాణావాదులొక వైపు, విభజిస్తే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాలు మొదలుపెడతామని హెచ్చరికలు జారిచేస్తున్న సీమాంధ్ర నాయకులూ మరోవైపు, రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేయడమే గాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిస్థితి ఏవిదంగా ఉండబోతుందో ఇప్పుడే ప్రజల కళ్ళకి కటినట్లు చూపుతున్నారు.

 

తనను తానూ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి పెద్దన్నగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ఈ క్లిష్ట పరిస్థితులను ఏవిధంగా పరిష్కరించాలనే ఆలోచనలతోనే సతమతమవుతోందిప్పుడు. అది మరో సారి అసమర్దంగా వ్యహరిస్తే, రాష్ట్రంలో తీవ్ర అశాంతి, అరాచకానికి దారితీస్తుంది.