పొలిటికల్ కామెడీ స్టార్ పాల్ ఫైర్స్ ఎగైన్.. నిన్నకేటీఆర్, కేసీఆర్..నేడు చంద్రబాబు, పవన్..
posted on: May 9, 2022 6:25AM
రాజకీయాలలో నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు హీట్ పెంచుతాయి. ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఆవేశ, కావేషాలను పెంచుతాయి. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ విమర్శలతో హాస్యాన్ని పెంచే నాయకుడు ఒకే ఒక్కడు ఉన్నారు. ఆయన పేరు కే.ఏ.పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు. సాధారణంగా ఆయన సీన్ మీదకు రారు. ఎన్నికలు వస్తే కానీ కనిపించరు. కానీ ఎన్నికల వాతావరణం కనిపించిందంటే ఆయన విమర్శలతో రెచ్చిపోతారు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఇండియా ప్రధాని దాకా, బిల్ గేట్స్ నుంచి ముఖేష్ అంబానీ వరకూ అందరూ తన సలహాలూ, సూచనలూ, బోధనలతో బాగుపడిన వారే అని చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పార్టీల మీదా, నేతల మీదా ఒంటి కాలి మీద లేచి మరీ విమర్శలు గుప్పిస్తారు. ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడగా ఎవరూ విన్నది లేదు. కానీ వీళ్ల వల్లే దేశం నాశనమైంది... అదే నేనైతేనా అంటూ నేల విడిచి సాము చేస్తారు.
2014 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో కే.ఏ. పాల్ చేసిన హడావుడీ, పంచిన హాస్యం అందరికీ ఇప్పటికీ గుర్తుంది. మొత్తం 175 స్థానాలలోనూ పోటీ చేస్తానంటూ ఆయన చేసిన హంగామా, చివరికి సోదిలోకే లేకుండా అసలు పోటీయే చేయకుండా తప్పుకున్న కామెడీ ఎవరికీ మరపురాదు. ఆ తరువాత ఆయన రాజకీయ ఎరీనాపై మళ్లీ ఇటీవలే కనిపిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘ముందస్తు’ అంచనాల నేపథ్యంలో ఆయన మళ్లీ రంగంలోనికి వచ్చారు. నిన్న మొన్నటి వరకూ తెరాస అధినేత కేఏ పాల్ పైనా, ఆయన కుమారుడు, మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైనా విమర్శలతో చెడుగుడు ఆడుకున్న ఆయన.. ఇప్పుడు ఏపీపై పడ్డారు. చంద్రబాబు వల్ల ఏకంగా దేశం నాశనమైపోయిందన్నారు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నారు.
ఆయన మాటలు కోటలు దాటుతాయి. ప్రజాశాంతి పార్టీలో పాల్ కాకుండా ఇంకా ఉన్న నేతలెవరో? అసలా పార్టీకి కార్యకర్తలు ఉన్నారా? పార్టీ కమిటీలు ఉన్నాయా? నిర్మాణం ఉందా వంటి ప్రశ్నలు ఎవరికీ రావు. అవి అవసరమని పాల్ అనుకోరు. వన్ మేన్ ఆర్మీలా, పాల్ ది వన్ మేన్ పార్టీ. ఆయన విమర్శలు, వ్యాఖ్యలు, విన్యాసాలను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కామెడీ పండుతుందని ఎలక్ట్రానిక్ మీడియా ఆయన ప్రసంగాలను టెలికాస్ట్ చేస్తుంది. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయనీ, పార్టీల మధ్య హీట్ థార్ ఎడారిని మించి ఉంటుందనీ అంచనాలున్న నేపథ్యంలో కేఏ పాల్ ఎంట్రీ అటు నేతలకూ, ఇటు ప్రజలకూ కొంత వినోదాన్ని పంచడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.


.webp)



