సంస్కారం


ఒక ఐస్‌క్రీం షాపులోకి ఓ పిల్లవాడు బిక్కుబిక్కుమంటే ప్రవేశించాడు. మాసిపోయిన బట్టలు, బెదురు చూపులు... చూస్తుంటేనే ఏదో పేదింటి పిల్లవాడిలా ఉంది అతని వాలకం. పిల్లవాడు వెళ్లి ఒక బల్ల దగ్గర కూర్చోగానే తప్పదన్నట్లుగా ఓ వెయిటర్‌ అతని దగ్గరకు వెళ్లాడు.

 

‘ఏం కావాలి?’ అని విసుగ్గా అడిగాడు వెయిటర్‌.

‘ఒక చాక్లెట్‌ ఐస్‌క్రీం ఎంత!’ వాకబు చేశాడు పిల్లవాడు.

‘అరవై రూపాయలు’- చెప్పాడు వెయిటర్.

‘ఓహ్‌! నా దగ్గర అంత డబ్బు లేదు. వెనిలా అయితే ఎంత?’ దీనంగా అడిగాడు పిల్లవాడు.

‘యాభై రూపాయలు’ అసహనంగా బదులిచ్చాడు వెయిటర్‌.

‘సరే, అది కూడా వద్దులే! ఒక మామూలు ఐస్‌క్రీం ఎంత?' అంటూ అభ్యర్థనలోకి దిగాడు పిల్లవాడు.

‘నలభై రూపాయలు. ఇక అంతకంటే తక్కువ ధరలో ఐస్‌క్రీం దొరకదు’ అంటూ చిరాకుపడ్డాడు వెయిటర్‌.

‘అయితే నాకు మామూలు ఐస్‌క్రీం తీసుకురండి చాలు!' ’అంటూ జేబుని తడుముకున్నాడు పిల్లవాడు.

 

వెయిటర్‌కి పిల్లవాడిని చూస్తుంటేనే ఒళ్లు మండిపోతోంది. వాడిని బయటకు తరిమేయాలని ఉందికానీ, నలుగురి కళ్లూ పడతాయని ఊరుకున్నాడు. అప్పటికీ పిల్లవాడని అడిగాడు ‘బయట ఇంకా తక్కువ రేటుకే ఐస్‌క్రీం దొరుకుతుంది కదా! ఇక్కడికి వచ్చి ఎందుకు తినడం?'’అని. దానికి పిల్లవాడు ‘నాకు ఎప్పటి నుంచో ఈ అద్దం పక్కన కూర్చుని, రోడ్డు వంక చూస్తూ ఐస్‌క్రీం తినాలని కోరికగా ఉండేది. అందుకనే పైసా పైసా కూడపెట్టాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

సరే! ఎట్టకేలకు పిల్లవాడు ఐస్‌క్రీం తినడం పూర్తిచేశాడు. ఆ పిల్లవాడు అక్కడ కూర్చుని నిదానంగా ఐస్‌క్రీంని ఆస్వాదిస్తున్నంత సేపూ వెయిటర్‌కి తేళ్లూజెర్రులూ పాకినట్లుంది. వాడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పోతాడా అని ఎదురుచూశాడు. పిల్లవాడు ఐస్‌క్రీంని పూర్తిచేసి సంతృప్తిగా అక్కడి నుంచి కదిలాడు.

 

బల్లని శుభ్రం చేద్దామని అక్కడికి వెళ్లిన వెయిటర్‌ నోట మాట రాలేదు. అతనికి టిప్‌ కింద ఒక పది రూపాయల నొటుని వదిలి వెళ్లాడు పిల్లాడు. ఆ పది రూపాయలని కూడా ఖర్చుపెట్టి ఉంటే ఇంకా మంచి ఐస్‌క్రీం దక్కి ఉండేది కదా! అయినా తనకి టిప్ ఇచ్చి సాయం చేయాలనే ఉద్దేశం కోసం ఆ పిల్లవాడు తన డబ్బుని మిగిల్చాడు. సంతోషాన్ని పంచుకోవడంలో కూడా తృప్తి ఉందనే విలువైన పాఠాన్ని ఆ పిల్లవాడు నేర్పి వెళ్లిపోయాడు.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


..Nirjara