TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగయ్య భార్యతో జగన్ భేటీపై పోలీసులు సీరియస్

Published on: Fri Jul 4, 2025 1:07PM

మాజీ సీఎం జగన్  రెంటపాళ్ల  పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే స్థానికుడి ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటోంది. మొదటికొస్తోంది. ఈ కేసు విచారణలో ఉండగానే..  కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ స్వయంగా సింగయ్య భార్యతో భేటీ అవడం వివాదాస్పదమైంది. పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సింగయ్య భార్య లూర్ద్ మేరీతో జగన్ భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన భర్త ప్రమాదం తర్వాత బతికే ఉన్నాడనీ, మాట్లాడాడనీ..  కానీ అంబులెన్స్‌లోనే ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాదు టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటికి వచ్చి లోకేశ్ పేరు చెప్పి తమకు అనుకూలంగా మాట్లాడాలంటూ బెదిరించారని కూడా ఆరోపించింది. పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారంటోంది. 

వాస్తవానికి జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాల కింద సింగయ్య పడిన దృశ్యాల వీడియో ఫుటేజ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. ఆ వీడియోను అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు చేయించామని, ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని చెప్తున్నారు. సింగయ్య భార్యని జగన్ కలవడం, ఆమె మీడియాతో మాట్లాడటంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విచారణలో ఉండగా.. నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాధితుల కుటుంబ సభ్యులను కలవడం, వారి ద్వారా తమకు అనుకూలంగా ప్రకటనలు చేయించడం చట్టవిరుద్ధమని అంటున్నారు. వైఎస్ జగన్ చర్యలు చట్టప్రకారం ఎంతవరకు సమంజసం అనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. 

కేసు నుంచి తప్పించుకునేందుకే  సింగయ్య భార్యని మేనేజ్ చేసి, తమకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం తప్పుడు ప్రచారాలతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని.. కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా?  కంపచెట్లలో పడేసి వెళ్లారంటే, మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. మరోవైపు.. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని కొట్టేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు, అరెస్ట్‌పై రెండు వారాల పాటు స్టే విధించింది న్యాయస్థానం. ఇది.. జగన్‌కి తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ.. రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది.