పోలీస్... జనం ఇష్టపడని ఆప్తుడు!

ఈ మధ్య అందరి దృష్టీ ఆర్మీపై పడింది. కారణం ఉగ్రవాదుల దాడి, తరువాత మన వారు విజయవంతంగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్. అంతే కాదు, చాలా మంది జవాన్ల కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుకుంటున్నారు. కాని, ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సిన మరో వ్యవస్థ కూడా వుంది... అదే పోలీస్ వ్వవస్థ!

పోలీస్ అనగానే ఆర్మీకి ఇచ్చినంత గౌరవం ఇవ్వరు మన దేశంలో. ఇక కొందరు సో కాల్డ్ మేధావులైతే పోలీసులని నర రూప రాక్షసుల్లా కూడా చూస్తారు! అడవుల్లో గన్నులు పట్టుకుని తిరిగే అన్నలకు మద్దతు తెలిపే పౌర, మానవ హక్కుల సంఘాలు జనం మధ్య వుండే పోలీసులకి ఎట్టి పరిస్థితుల్లో అండగా నిలవవు. నిజానికి నిలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, ఆర్మీ లాగే పోలీసులు కూడా దేశం కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పని చే్స్తున్నారు. వాళ్లు తమ విధుల్లో భాగంగా అనేక సార్లు అమరులు కూడా అవుతుంటారు. అయినా కూడా యుద్ధంలో నేలకొరిగిన ఆర్మీ జవాన్ అంత గౌరవం పోలీసులకి దక్కదు. దానికి కారణం ప్రజల్లో వున్న వివక్ష అని తేల్చేయలేం. పోలీసుల ప్రవర్తన కూడా చాలా సార్లు వారికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంటుంది... 

ఒక్కసారి మన సినిమాల్నే తీసుకుంటే... పోలీసు ఎన్ని సినిమాల్లో హీరోగా కనిపిస్తాడో అంతకంటే ఎక్కువ సినిమాల్లో విలన్ గా కనిపిస్తాడు. నిజంగా కూడా కనిపించని నాలుగో సింహాల పరిస్థితి అదే. వాళ్లు లేకుంటే మన సమాజం అల్లకల్లోలంగా మారిపోతుంది. అయినా సరే చాలా సార్లు కొందరు పోలీసులు రాక్షసంగా ప్రవర్తించి డిపార్ట్ మెంట్ మొత్తానికి చెడ్డపేరు తెస్తుంటారు. అంతే కాదు, తమ ప్రవర్తనతో పోలీసులు.. సామాన్యులు భరోసాగా వుండాల్సింది పోయి భయంగా పక్కకు పోయే స్థితి తెస్తున్నారు. ఇలాంటి అంశాల్లో పోలీసుల్ని , పోలీస్ డిపార్ట్ మెంట్ ని సంస్కరించాల్సిన అవసరం వుంది. సామాన్యులతో వారు ప్రవర్తించే తీరు మార్చాల్సిన అవసరం చాలా వుంది. అంతే కాదు, అవినీతి విషయంలో కూడా పోలీసుల్లో చాలా మార్పు రావాల్సి వుంది. పోలీసుల్లో నిజాయితీ పరులు వుండరని ఎవ్వరూ చెప్పకపోయినా చాలా వరకూ కనిపించేది మాత్రం అవినీతిపరులే. హోమ్ గార్డ్ నుంచి డీజీపీ వరకూ అందరి మీదా ఆరోపణలు వస్తూనే వుంటాయి. అయినా కూడా పోలీస్ యూనిఫామ్ కి వుండే దర్పం, శక్తి వల్ల అవన్నీ అణిగిపోతుంటాయి. ఇలాంటి అవినీతి , అరాచక ప్రవర్తనని అరికట్టాల్సి వుంది... 
పోలీసుల్లోని చెడు ఎంతో చర్చకొచ్చినా వాళ్ల సమస్యలు మాత్రం అస్సలు బయటకి రావు. అంతా మంచిగా వున్నప్పుడు పోలీసుల్ని ఎంతో విమర్శించిన వాడు కూడా చిన్న సమస్య రాగానే స్టేషన్ కి వెళ్లిపోతాడు. నిత్యం వందల కేసులు పరిష్కరించి పంపే పోలీసులు ఏ ఒక్క చోట సరిగ్గా స్పందించకపోయినా మీడియా వేట కుక్కలా వెంటపడుతుంది. కాని, రోడ్డు మీద కూడలిలో విష వాయువులు పీల్చుకునే ట్రాఫిక్ పోలీస్ మొదలు దట్టమైన అడవుల్లో మావోయిస్టుల మందు పాతరల మధ్య తిరిగే గ్రేహౌండ్స్ వరకూ ఎందరు పోలీసులు ఎన్ని త్యాగాలు చేసిన ఎవ్వరూ పట్టించుకోరు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి ఇద్దరు పోలీసుల్లో ఒకరికి అనారోగ్యం వుంటోందట. తల నొప్పి మొదలు ప్రాణాంతక శ్వాస కోశ వ్యాధుల వరకూ పోలీసులకు వస్తోన్న వ్యాధులు ఎన్నో. కాని, ప్రభుత్వం తరుఫున అందుతున్న సాయం మాత్రం అంతంత మాత్రమే. ఇక పోలీసుల సంఖ్య, కేసుల సంఖ్య రోజు రోజుకు రివర్స్ గా వుంటోంది. కనీసం వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ కూడా వుండని పరిస్థితి వుందంటే పోలీసులకి ఎంతగా శారీరిక , మానసిక ఒత్తిడి వుంటోందో అర్థం చేసుకోవచ్చు! 

పోలీస్ సంస్మరణ దినం రోజున సంవత్సరానికి ఒకసారి సెల్యూట్లు చేయటం కాకుండా పాలకులు సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. పోలీసుల సమస్యలు పరిష్కరిస్తూనే వాళ్లని సంస్కరించాల్సిన ఆవశ్యకత వుంది. అలాగే జనంలో కూడా పోలీసుల పట్ల మరింత గౌరవ భావం  రావాలి. దానికంటే ముందు తమ మీద గౌరవం కలిగేలా పోలీసులు ప్రవర్తించాలి. మరీ ముఖ్యంగా, పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలి.