వెరైటీ దొంగతనం.. రూ.కోటి విలువైన డీజిల్ చోరీ!!

 

కొందరు నిజాయితీగా బ్రతకడానికి తమ తెలివితేటలు ఉపయోగించరు కానీ అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తారు. చివరికి జైల్లో కూర్చొని ఊచలు లెక్కపెడతారు. ఆ కోవలోకే వస్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్యాంగ్. పైప్‌లైన్‌కు కన్నం వేసి ఏకంగా రూ.కోటి విలువైన 1,30,601 కిలో లీటర్ల డీజిల్‌ను కొట్టేసారు. చివరికి జైలు పాలయ్యారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఘట్‌కేసర్‌ నుంచి చర్లపల్లి ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌ ఆయిల్‌ సంస్థల నిల్వ కేంద్రాలకు డీజిల్‌ సరఫరా కోసం 17 కి.మీ.ల ప్రధాన పైప్‌లైన్‌ ఉంది. మహారాష్ట్ర థానే జిల్లా ముమ్రా అమృత్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ హఫీజ్‌ అజీజ్‌ చౌదరి, ముంబయికి చెందిన జియావుల్‌ చాంద్‌షేక్‌ అలియాస్‌ చెడ్డీ బెంగాలి, సర్జూ, సురేశ్‌కుమార్‌ ప్రజాప్రతి, మహబూబ్‌నగర్‌కు చెందిన బిన్ని శ్రీనివాసులు నేతృత్వంలోని ముఠా ఈ పైప్‌లైన్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా అజీజ్‌ చౌదరి.. హైదరాబాద్‌ బహుదూర్‌పురాలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడిపే తన బంధువు మహ్మద్‌ అబ్దుల్‌ అబ్రార్‌ను సంప్రదించి పథకం గురించి వివరించాడు. వీరంతా కలిసి కీసరలో మహేందర్‌గౌడ్‌ను కలిసి.. ప్రధాన పైప్‌లైన్‌ పక్కనే ఉన్న అతనికి చెందిన ఒక ఎకరం స్థలాన్ని పాత ఇనుప సామానును నిల్వ చేస్తామంటూ గత ఏడాది అక్టోబరులో లీజుకు తీసుకున్నారు.

 

 

లీజు స్థలంలో రేకులతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రధాన పైపులైన్‌ వరకు సొరంగం తవ్వి.. పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, దానికి గేట్‌వాల్‌తో కూడిన ఐరన్‌ క్లిప్‌లను బిగించారు. ఆ తర్వాత చిన్న మోటారును బిగించి చిన్న పైప్‌ ద్వారా డీజిల్‌ను లాగేవారు. దాన్ని ట్యాంకర్లలోకి లోడ్‌చేసి తీసుకెళ్లేవారు. లీజు.. సొరంగం పనులను అక్టోబరు, నవంబరుల్లో పూర్తిచేసి.. డిసెంబరు నుంచి రూ.కోటి విలువైన 1,30,601 కిలో లీటర్ల డీజిల్‌ను తస్కరించారు. ఆ డీజిల్‌ను అమ్మేందుకు మధ్యవర్తుల ద్వారా 8మందిని చేర్చుకొని.. ట్యాంకర్ల ద్వారా వరంగల్‌, బాచుపల్లి, బూర్గుల, కోయలకొండ, ధర్మాబాద్‌తో పాటు, మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో బ్లాక్‌ మార్కెట్లలో విక్రయించారు. వచ్చిన సొత్తును వాటాలుగా పంచుకున్నారు.

 

 

నెలరోజులుగా బీపీసీఎల్‌, ఐవోసీఎల్‌ కంపెనీలకు డీజిల్‌ సరఫరా తగ్గింది. ఘట్‌కేసర్‌ నుంచి విడుదలవుతున్న డీజిల్‌కు కంపెనీలకు చేరుతున్నదానికి పొంతన లేకుండా ఉండటంతో కంపెనీ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. దాంతో కీసర పోలీసులను ఆశ్రయించారు. సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి సీసీఎస్‌, కీసర పోలీసులు 17కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా విచారణ జరిపారు. అర్ధరాత్రిపూట ఎలాంటి అనుమానం రాకుండా సొంరంగం ద్వారా పైప్‌లైన్‌కు కన్నం వేసి కొందరు డీజిల్‌ తస్కరిస్తున్నట్లు గుర్తించారు. హఫీజ్‌ అజీజ్‌ చౌదరి, బిన్ని శ్రీను, మహ్మద్‌ అబ్దుల్‌ అబ్రార్‌, మారోజు జయకృష్ణలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 90.4లక్షల నగదు, ఒక ట్యాంకర్‌, కారు, యాక్టివా బైక్‌, ఎలక్ట్రిక్‌ మోటారు, పైపులను స్వాధీనం చేసుకున్నారు.